● కళ తప్పిన మ్యాంగో మార్కెట్
● తెగుళ్లతో నేలరాలుతున్న మామిడిపంట
● తగ్గిపోతున్న సాగు విస్తీర్ణం
మెరకముడిదాం: ఏటా వేసవికాలంలో మామిడిపంట ఎగుమతులు, దిగుమతులతో కళకళలాడిన విజయనగరం జిల్లా మార్కెట్ ఈ ఏడాది దిగుబడిలేక వెలవెల బోతోంది. దీర్ఘకాలంగా మామిడిపంట సాగుతో జీవనం సాగించే రైతాంగానికి వాతావరణ ప్రతికూలతతో పంట పాడై పోగా ఉన్న పంట కాస్తా తెగుళ్లతో పూత, పిందెరాలిపోవడంతో మిగిలిన పంటను కొనేవారు ముందుకు రాక మామిడిరైతులు కుదేలవుతున్నారు. విజయనగరం జిల్లావ్యాప్తంగా 30,940 ఎకరాల్లో మామిడిపంటను రైతులు సాగుచేస్తున్నారు. అయితే మార్కెట్‌లో అత్యంత డిమాండ్ ఉన్న బంగినపల్లి, సువర్ణరేఖ రకాల మామిడిపంట దిగుబడి పూర్తిస్థాయిలో తగ్గిపోవడంతో ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కత్తా, చైన్నై, తదితర ప్రాంతాల నుంచి వచ్చే వ్యాపారులు ఈ ఏడాది ముఖం చాటేసే పరిస్థితి నెలకొంది. మామిడి సీజన్‌లో ఎగుమతి, దిగుమతులపై కూలీలు, దళారులు, లారీలు, ట్రాక్టర్లు, వ్యాన్ల డ్రైవర్లు వందలాదిమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిపొందుతుండగా, మార్కెట్ ప్రతికూలతతో వారంతా రోడ్డునపడే పరిస్థితి నెలకొంది.
తెగుళ్లతో నష్టాలు:
ఏటా పూతదశలోనే ప్రారంభమవుతున్న తెగుళ్లు పిందెదశలో ఉధృతమై కాపు నేలరాలిపోయి రైతులు తీవ్రనష్టాలు చవిచూస్తున్నారు. ఈ ఏడాది సైతం నల్లతామర, తేనెమంచు తెగుళ్లతో పాటు ఇతర తెగుళ్ల కారణంగా చాలా వరకూ మామిడిపంట నేలరాలిపోయింది. దీనికి తోడు ఇటీవల వచ్చిన ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా చాలావరకూ పంట నేలరాలిపోగా, ఉన్న కాస్త పంట వర్షం కారణంగా పురుగు పట్టిపోతుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. అయితే ప్రస్తుతం పనుకులు రకం సీజన్ ప్రారంభంలో ఆశాజనకంగా ఉన్నప్పటికీ మార్కెట్‌లో గిరాకీ లేకపోవడంతో తక్కువధరకే అమ్మకోవలసిన పరిస్థితి నెలకొంది. వాతావరణ ప్రభావంతో రైతులు భయపడి సీజన్ ప్రారంభం నుంచే ఎదుగుదల రాకపోయినా కాయలు కోసి అమ్మేసుకోవడంతో ధర గిట్టుబాటు కావడంలేదు. సీజన్ మొదటిలో పనుకులు రకం టన్ను రూ.35 వేలు పలకగా, ప్రస్తుతం సగం ధర కూడా రావడంలేదని రైతులు వాపోతున్నారు. బంగినపల్లిలో నంబర్ వన్ రకం– టన్ను రూ.60 వేలకు పైగా ధర పలుకుతున్నప్పటికీ మార్కెట్‌లో ఈ రకం పెద్దగా కనిపించడంలేదు. మామిడి రుచి చూద్దామని ఆశించేవారికి డజను కాయలు వందలాదిరూపాయల ధర పలుకుతుండడంతో కొనేందుకు వెనక్కి తగ్గుతున్నారు.
పూర్తిగా నష్టపోయాం..
మామిడితోటలు సాగు చేస్తే గతంలో మంచి దిగుబడి వస్తుండడంతో మంచి రాబడి వచ్చేది, దానికి తగిన లభాలు వచ్చేవి. గత నాలుగేళ్లుగా దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది, కాస్తో, కూస్తో దిగుబడి వస్తుందంటే ఆపంట ప్రకృతి కన్నెర్రకు నేలపాలవుతోంది. ప్రతి ఏడాది లక్షల్లో మదుపులు పెట్టినప్పటికీ తగిన దిగుబడి రాకపోవడంతో పూర్తిగా నష్టపోతున్నాం. గత ప్రభుత్వ హయాంలో మామిడిపంటపై బీమా ఉండేది. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా..భయం ఉండేది కాదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల నుంచి రైతులు బీమా కడుతున్నప్పటికీ విపత్కరపరిస్థితుల్లో ఆ బీమా రావడంలేదు, ఎందుకో అర్థం కావడంలేదు. మామిడిపంటతో నష్టపోయిన మమ్మల్ని ప్రభుత్వమే అన్ని విధాలా ఆదుకోవాలి. శిరువూరు నారాయణమూర్తిరాజు,
సువర్ణరేఖ మామిడిరైతుల సంఘం అధ్యక్షుడు, సోమలింగపురం


