ట్రాక్టర్‌ ఢీకొని యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ ఢీకొని యువకుడి మృతి

Apr 30 2026 7:43 AM | Updated on Apr 30 2026 7:43 AM

జామి: స్నేహితుడిని స్కూటీపై దించడానికి వెళ్తున్న సమయంలో ట్రాక్టర్‌ మృత్యువు రూపంలో వెంటాడి ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎల్‌.కోట మండలం ఖాసాపేట గ్రామానికి చెందిన యువకుడు కొటాన ఎర్నాయుడు (24) బీటెక్‌ పూర్తిచేశాడు. విశాఖ పట్నంలో ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. స్వగ్రామం అయిన ఖాసాపేటలో పండగకు వచ్చాడు. స్నేహితుడిని బుధవారం పెంట శ్రీరాంపురం స్కూటీపై దించడానికి తీసుకువెళ్లాడు. తాండ్రంగి గ్రామం సమీపంలో జామి నుంచి పిక్క లోడ్‌తో రేవళ్ల పాలెం వెళ్తున్న ట్రాక్టర్‌ వెనుకనుంచి స్కూటీని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఎర్నాయుడు మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న జామి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి జరిగిన ఘటనపై ఆరా తీశారు. ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసిదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీర జనార్దన్‌ తెలిపారు. వెంకటరావు, చినతల్లి దంపతులకు ఎర్నాయుడు ఒక్కడే కుమారుడు.ఇద్దరు అక్కలు ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో లైన్‌మన్‌..

సీతంపేట: మండలంలోని గొయిది గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నబగ్గ సచివాలయ పరిదిలో లైన్‌మన్‌గా పనిచేస్తున్న కీసరజోడుకు చెందిన బిడ్డిక శంకరరావు (36) బుధవారం మృతి చెందాడు. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన సోమగండి వీఆర్‌వో తులసిరావుకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై ఎస్సై వై.అమ్మన్నరావు అందించిన వివరాల ప్రకారం పాలకొండలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి ఇద్దరూ వెళ్లి ద్విచక్రవాహనంపై వస్తున్నారు. డ్రైవింగ్‌ చేస్తున్న శంకరరావు ముందున్న బైక్‌ను ఓవర్‌టేక్‌ చేయబోయే క్రమంలో వెనుక నుంచి ఢీకొట్టడంతో ఇద్దరూ అదుపు తప్పి కిందపడిపోయారు. తలపై శంకరరావుకు తీవ్రగాయలవడంతో వెంటనే 108 సాయంతో స్థానిక ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య శిరీష, ఏడాది కుమారుడు నివేది ఉన్నాడు. కుటుంబ పెద్ద మృతిచెందడంతో కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement