● రాష్ట్ర ఆస్పత్రుల విభాగం విజిలెన్స్ జాయింట్ కమిషనర్
పాలకొండ రూరల్: ప్రభుత్వ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రుల విభాగం విజిలెన్స్ జాయింట్ కమిషనర్ నాయక్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన స్థానిక ఏరియా ఆస్పత్రిని తన బృంద సభ్యులతో కలిసి ఆకశ్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ప్రతి వార్డు నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవలు, ఇతర మౌలిక వసతులు, అందిస్తున్న భోజనంపై ఆరా తీశారు. ఈ క్రమంలో ముఖ ఆధారిత హాజరుపై కచ్చితత్వం అవసరమన్నారు. సకాలంలో విధులకు హాజరు లేకుంటే సేవలు సక్రమంగా అందించడంలో ఏర్పడే అవరోధాలను ఎలా అధిగమిస్తారని ప్రశ్నించారు. మూడు సార్లు ముఖ హాజరులో అలస్యం గుర్తిస్తే ఓ రోజు సెలవుగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. ఇటీవల మంజూరైన నిధులతో జరుగుతున్న పనుల తాజా స్థితిగతులు, రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట డీసీహెచ్‌ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కడియం చిరంజీవి, ఆర్‌ఎంఓ కె.రవికుమార్, సహ వైద్యులు, పలు విభాగాల సిబ్బంది ఉన్నారు.


