● బుక్ చేసిన 20 రోజులకు గానీ
రాని గ్యాస్ సిలిండర్
● తీవ్ర ఇబ్బందులు పడుతున్న
వినియోగదారులు
పూసపాటిరేగ: మండలంలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. అమెరికా–ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడిందన్నది విస్తృత ప్రచారంలో ఉండగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అసలు గ్యాస్ కొరతే లేదని చెబుతుండడం విడ్డూరంగా ఉందని జనం అంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పినంత సులభంగా గ్యాస్ దొరకడం లేదని, ఒక్క గ్యాస్ సిలిండర్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి నెలకొందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్యాస్ బుక్ చేసి 20 రోజులైతే గానీ గ్యాస్ ఇంటికి రావడం లేదని, మరోవైపు ఒక గ్యాస్ బుకింగ్‌కు మరో గ్యాస్ బుకింగ్‌కు 40 రోజుల సమయాన్ని పరిమితిగా విధించడం, సరిపడ గ్యాస్ సరఫరా లేకపోవడం చూస్తే ఇప్పట్లో గ్యాస్ కష్టాలు తీరేలా లేవని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా పూసపాటిరేగ మండలంలోని చింతపల్లికి సకాలంలో గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయకపోవడంపై మత్స్యకార నాయకుడు బర్రి చిన్నఅప్పన్న సోమవారం మండల కేంద్రంలోని గాయిత్రి గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి, గ్యాస్ పంపిణీలో జాప్యంపై సిబ్బందిని ప్రశ్నించారు. కనీసం గ్యాస్ బుక్ చేసుకున్న వారికై నా సమయానికి గ్యాస్ పంపించాలని కోరారు.


