విజయనగరం క్రైమ్: తల్లి మరణాన్ని జీర్ణించుకోలేని పోలీస్ కానిస్టేబుల్ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని దాసన్నపేటలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై కృష్ణమూర్తి తెలియజేసిన వివరాల మేరకు.. ఏపీఎస్పీ చింతలవలస బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గెడ్డం నారాయణమూర్తి తల్లి, భార్యా పిల్లలు, ఇద్దరు తమ్ముళ్లతో కలిసి దాసన్నపేటలో నివాసముంటున్నారు. అయితే ఇటీవల అతని తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. తల్లి మరణాన్ని జీర్ణించుకోలేని నారాయణమూర్తి అప్పటి నుంచి ముభావంగా ఉంటున్నారు. ఈక్రమంలో ఆదివారం రాత్రి భోజనం కూడా చేయకుండా తన రూమ్‌లో పడుకున్నాడు. సోమవారం ఉదయం తలుపు తట్టినా ఎటువంటి స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు విరగ్గొట్టి చూడగా.. నారాయణమూర్తి ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. మృతుడి భార్య సౌందర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ ఎస్సై కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


