కమీషన్ నిధులూ స్వాహా
‘ప్రైవేటు’కే ఉపాధి
● గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో నిధుల దుర్వినియోగం
● యంత్రాల కొనుగోలులో అక్రమాలు
మండల సమాఖ్యల నుంచి సేకరించిన అదనపు నిధులతో అటవీ, వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి 11 వీడీవీకేలకు రూ.19 లక్షలు అడ్వాన్సుల రూపంలో విడుదల చేశారు. కొనుగోలు చేసిన పరికరాలు, నిధుల వినియోగం, పర్యవేక్షణపై పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. వీడీవీకేలకు నిధులు ఇప్పటికే ఉన్నప్పటికీ.. అడ్వాన్సు విడుదల చేయడంతో పాటు.. మండల సమాఖ్యల నుంచి అదనపు, అనధికారిక అడ్వాన్సులు స్వీకరించినట్లు తేలింది. గిరిజన అటవీ ఉత్పత్తుల సేకరణకు, గిరిజన వర్గాల జీవనోపాధి, ఆర్థిక అభ్యున్నతిని లక్ష్యంగా మంజూరు చేసిన ప్రభుత్వ నిధులను దారి మళ్లించి, ఇతర ప్రయోజనాల కోసం వినియోగించినట్లు గుర్తించారు. నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించి వీడీవీకేల కోసం ఎఫ్‌పీవో నిధుల నుంచి రూ.224 లక్షలు అడ్వాన్సులు తీసుకున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం(సెర్ప్) దృష్టికి వచ్చిన తర్వాత కొంత మొత్తాన్ని చెల్లించారు. పార్వతీపురంలోని లక్ష్మీబాయి వీడీవీకే నుంచి రూ.21,31,700 మొత్తం వసూలు చేయలేదు. జిల్లాలోని సాలూరు, మక్కువ, కురుపాం ప్రాంతాలలో స్థానికంగా పండిస్తున్నప్పటికీ.. మినముల పప్పును స్థానిక వనరుల నుంచి కాక.. సీతానగరం బుడ్డిపేట మిల్లు నుంచి సేకరించారు. పసుపును పాడేరు నుంచి పెద్ద మొత్తంలో రవాణా చేశారని ఆరోపణ. మండల సమాఖ్యలు, గిరిజన మహిళా సమాఖ్యల నుంచి తీసుకున్న అడ్వాన్సులకు సరిగా లెక్కలు చూపలేదు. అంతేకాక, ఈ కొనుగోళ్ల ద్వారా వచ్చిన లాభాలను ఆయా మండల సమాఖ్యలకు తిరిగి జమ చేయలేదు.
సాక్షి, పార్వతీపురం మన్యం: వివిధ యూనిట్లకు అక్రమంగా నిధులు కేటాయించడం.. యంత్రాలు నిరుపయోగంగా ఉన్నా రూ.లక్షలు వెచ్చించడం.. ధాన్యం కొనుగోలు కమీషన్ నిధులు స్వాహాచేయడం.. అగరబత్తీ పరిశ్రమ ఏర్పాటుతో గిరిజనులకు ఎలాంటి ఉపాధి కల్పించకుండానే నిధులు ఖర్చుచేయడం వంటి అవినీతి పనులు ‘వెలుగు’లోకి రావడం ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ) మాజీ ఏపీడీ, గతంలో ఇన్‌చార్జి పీడీగా పనిచేసిన వై.సత్యంనాయుడు మీద వచ్చిన అవినీతి, అక్రమ ఆరోపణలపై నిర్వహించిన సమగ్ర విచారణలో అనేక కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పేరుతో నిధుల దుర్వినియోగం, యంత్రాల కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు విచారణ అధికారిగా వ్యవహరించిన గత ప్రాజెక్టు డైరెక్టర్ ఎం.సుధారాణి సమర్పించిన నివేదికలో స్పష్టమైంది. ఇప్పటికే పూర్వ ఏపీడీ సావిత్రి మీద అనేక ఆరోపణలు ఉన్న విషయం విదితమే. కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసిన యంత్రాలు సరైన విధంగా ఉపయోగించకపోవడంతో ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్లు విచారణలో వెల్లడైంది. దీనికితోడు.. పెద్ద ఎత్తున కమీషన్లతో నిధులు పక్కదారి పట్టించారని తెలుస్తోంది.
యంత్రాలు ఏర్పాటు చేయకున్నా.. నిధుల చెల్లింపు
చింతపండు కేక్ తయారీ కోసం మొత్తం ఎనిమిది యంత్రాలు కొనుగోలు చేశారు. ఒక్కో యంత్రం ధర సుమారు రూ.21.43 లక్షలు. మొత్తం వ్యయం సుమారు రూ.1.71 కోట్లు. ఐటీడీఏ పరిధిలోని ఎనిమిది మండలాలకు ఒక్కో యంత్రం కేటాయించారు. ఎనిమిది యంత్రాల్లో నాలుగే పని చేస్తున్నట్లు విచారణలో గుర్తించారు. జియ్యమ్మవలస, పాచిపెంట మండలాల్లో యంత్రాలు పూర్తిగా వినియోగంలో లేవు. మిగతా యంత్రాల పనితీరు కూడా అంతంతే.
చింతపండు ప్రాసెసింగ్, విక్రయాల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. యంత్రాల వినియోగం సరిగా లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో భారీ నష్టాలు నమోదయ్యాయి. కురుపాం, గుమ్మలక్ష్మీపురం, మక్కువల్లో లాభాలు చాలా తక్కువగా, స్థిరంగా లేకుండా ఉన్నట్లు విచారణలో తేలింది. ప్రాజెక్టు అమలులో లోపాలు, పర్యవేక్షణలో నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది.
రూ. 29.23 లక్షలతో కొన్న పప్పు ధాన్యాలు, పసుపు ప్రాసెసింగ్ యూనిట్లు మూడేళ్లుగా మూలన పడి ఉండడంతో ప్రభుత్వ ధనం వృథా అయినట్లు గుర్తించారు. 2022 జూలై 26న యంత్రాలను వ్యవస్థాపించకుండా గిరిజన మహిళా సమాఖ్య వద్ద పడేశారు. ఏడాది తర్వాత పప్పుధాన్యాల శుద్ధి యంత్రాన్ని కురుపాం మండలానికి కేటాయించారు. అది కూడా నిరుపయోగంగానే ఉందని గుర్తించారు.
మంజూరైన గ్రామాలకు కాకుండా ఇతర ప్రదేశాలలో, అనుమతి లేకుండా యంత్రాలను ఏర్పాటు చేశారు. గిరిజన మహిళా సమాఖ్యలో ఒక పప్పు యూనిట్ మూడు సంవత్సరాలకు పైగా నిరుపయోగంగా ఉంది. యంత్రాలను ఏర్పాటు చేయనప్పటికీ 83 శాతం నిధులు చెల్లించారు. ఒకే ఒక్క పసుపు యూనిట్ (మక్కువ) మాత్రమే పనిచేస్తోంది. ఈ యంత్రాలపై మూడు సంవత్సరాలలో వచ్చిన మొత్తం లాభం కేవలం రూ.15,180 మాత్రమే. దీనికి సంబంధించిన రికార్డులు ఎక్కడా లభ్యం కాకపోవడం గమనార్హం. వీటి కొనుగోలులో ఒక నిర్ధిష్ట ప్రణాళికంటూ ఏదీ లేదు.
రూ.1,84,600 వ్యయం చేసి ఎనిమిది చీపురు గడ్డి కోసే యంత్రాలు కొనుగోలు చేశారు. కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాలకు యంత్రాలు సరఫరా చేయలేదు. జియ్యమ్మవలస మండల యంత్రం ఆచూకీ లేకపోయింది. పాచిపెంట, మక్కువ మండలాలు మాత్రమే లాభాలను ఆర్జించాయి. సాలూరు, పార్వతీపురం మండలాల్లోని యంత్రాలు పని చేయడంలేదు. ఎనిమిది చీపురు కోసే యంత్రాలను సేకరించినప్పటికీ.. పంపిణీ, పర్యవేక్షణ సరిగా లేవని గుర్తించారు.
ధాన్యం కొనుగోలు కమీషన్ కింద వచ్చిన సుమారు రూ.94.13లక్షల నిధుల్లో రూ.58.96 లక్షలను నిబంధనలకు విరుద్ధంగా మళ్లించినట్లు గుర్తించారు. దసరా ఉత్సవాలు, వాహన అద్దెలు, భవన మరమ్మతులకు వీటిని వినియోగించినట్లు తెలిసింది. దీనికి ఎలాంటి ముందస్తు అనుమతులూ లేవని విచారణలో తేలింది.
సేవా కేంద్రాల కోసం పంపిణీ చేసిన 40 ల్యాప్‌టాప్‌లలో 27 పని చేయడం లేదు. వెనక్కి తీసుకున్నట్లు రికార్డుల్లో ఉన్నా.. నాలుగు ల్యాప్‌టాప్‌లు ప్రస్తుతం కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంపై విచారణాధికారులు విస్మయం వ్యక్తం చేశారు.
ఉన్నతి పథకం కింద ఇచ్చిన రుణాల వసూళ్లలో తీవ్ర జాప్యం జరిగింది. లబ్ధిదారుల నుంచి వసూలు చేసిన నగదును సంబంధిత ఖాతాల్లో జమ చేయకుండా ఇతర అవసరాలకు వినియోగించినట్లు ఆరోపణలు వచ్చాయి.
గిరిజనులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాల్సిన అగరబత్తీ తయారీ పనిని ప్రైవేట్ పరిశ్రమకు అప్పగించారు. దీనివల్ల గిరిజనులకు ఎలాంటి ఉపాధి లభించలేదు. నాలుగు వీడీవీకేలకు అగరబత్తిల తయారీలో శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. హిరమండలంలోని సత్య అగరబత్తి పరిశ్రమకు రూ.24 లక్షలు చెల్లించారు. సదరు పరిశ్రమలో అగరబత్తిలు తయారు చేసి, వీడీవీకేల పేరిట వ్యాపారం నిర్వహించలేనట్లు తేలింది. గిరిజన లబ్ధిదారులకు ఎలాంటి ఉపాధి కూడా కల్పించలేదు.


