అబద్ధాల రాణి... | - | Sakshi
Sakshi News home page

అబద్ధాల రాణి...

Mar 24 2026 7:07 AM | Updated on Mar 24 2026 7:07 AM

సాలూరు: అబద్ధాలు చెప్పడంలో మంత్రి సంధ్యారాణి ఆరితేరిపోయారంటూ ప్రజలు చర్చించుకుంటున్నారని, సాలూరులో వందపడక ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ఆమె చెప్పిన అవాస్తవాలే దీనికి నిదర్శనమని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర విమర్శించారు. సాలూరు పట్టణంలోని తన స్వగృహంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళల ఆత్మగౌరవమని తెలిపిన మంత్రి.. పట్టణంలో సుమారు 20 లక్షల వ్యయంతో సామాజిక మరుగుదొడ్లు కట్టలేకపోయారన్నారు. ఇప్పుడు రూ.17 కోట్లు వెచ్చించి ఆస్పత్రి నిర్మించామని సభ సాక్షిగా అబద్ధాలు చెప్పడం చూసి సాలూరు ప్రజలు ముక్కునవేలేసుకుంటున్నారన్నారు. వందపడకల ఆస్పత్రి ప్రారంభోత్సవంలో మంత్రి చెప్పిన అవాస్తవాలను ఖండించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం దాదాపు 70 శాతానికి పైబడి ఆస్పత్రి పనులు పూర్తిచేయగా, పునాదుల్లోనే ఆస్పత్రిని వదిలేశారని మంత్రి మాట్లాడడం దారుణమన్నారు. గత ప్రభు త్వంలో జరిగిన ఆస్పత్రి భవన నిర్మాణం, నాడు ఆయన పరిశీలించిన ఫొటోలను తేదీలతో సహా చూపించారు. ఆస్పత్రి నిర్మాణం ఎవరి హయాంలో జరిగిందే ప్రజలందరికీ తెలుసన్నారు. గత ప్రభుత్వంలో కొంత పనులు జరిగాయని, మిగిలిన పను లు మేము పూర్తిచేశామని మంత్రి చెబితే ప్రజలు హర్షించేవారన్నారు. మున్సిపాలిటీ పాలకవర్గం ఉన్నప్పుడు ఆస్పత్రిని ప్రారంభిస్తే వైఎస్సార్‌సీపీకి చెందిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, తదితరుల పేర్లు శిలాఫలకంలో పెట్టాలనే దురుద్దేశంతో పాలకవర్గం ముగిసిన తరువాత ప్రారంభోత్సవం చేశారని ఎద్దేవా చేశారు. ఆస్పత్రికి ప్రహరీ, ఆక్సిజన్‌ ప్లాంట్‌, ఫైర్‌ సేఫ్టీ వంటి పనులు పూర్తిచేయాల్సి ఉందన్నారు.

ఆ పనులు ఎందుకు చేపట్టలేదు..?

● సాలూరు పట్టణంలో బోసుబొమ్మ కూడలి నుంచి వేదసమాజం వరకు రోడ్డు నిర్మాణానికి కొబ్బరికాయలు కొట్టిన మంత్రి ఆ పనులు నేటివరకు ఎందుకు చేపట్టలేకపోయారని ప్రశ్నించారు. రెండేళ్లు అవుతున్నా అన్నా క్యాంటిన్‌ నిర్మాణం చేయలేకపోయారన్నారు.

● ఆస్పత్రి ప్రారంభోత్వవ సమయంలో ఎవరినీ విజయనగరం రిఫర్‌ చేయరాదని మంత్రి తెలిపిన నిమిషాల వ్యవధిలోనే ఆస్పత్రి నుంచి ఓ కేసును అంబులెన్స్‌లో విజయనగరం తీసుకెళ్లారని, ఇది మంత్రి మాటలు, వాటి అమలు తీరుకు అద్దంపడుతోందన్నారు.

● అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే జీగిరాం జూట్‌ఫ్యాక్టరీ తెరిపిస్తామని హామీ ఇచ్చారని, రెండేళ్ల పాలనలో అటువైపు మంత్రి చూసిన దాఖలాలు లేవన్నారు. గతంలో కందులపదం బ్రిడ్జికు, మోసూరు బ్రిడ్జికు కొబ్బరికాయలు కొట్టి టీడీపీ నేతలు విడిచిపెట్టగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నిర్మాణం పూర్తిచేసిన విషయాన్ని గుర్తుచేశారు.

ప్రొటోకాల్‌ పాటించకపోవడం తగదు

సాధారణంగా పార్లమెంట్‌, శాసనసభ సమావేశాలు అయ్యేటప్పుడు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వంటి కార్యక్రమాలు చేపట్టరని, మరీ అత్యవసరమైతే సెలవు రోజుల్లో వాటని చేపడతారని పీడిక రాజన్నదొర అన్నారు. వందపడకల ఆస్పత్రి ప్రారంభోత్సవ సమయంలో గిరిజనురాలైన ఎంపీ తనూజారాణికు ముందురోజు సమాచారం ఇవ్వడం సరైనది కాదన్నారు. ఈ విషయంపై ఆమె పార్లమెంట్‌ స్పీకర్‌కు ఫిర్యాదుచేయనున్నారని, సంబంధిత అధికారులు దీనిపై తప్పకుండా విచారణ ఎదుర్కోకతప్పదన్నారు. శిలాఫలకంలో ఉన్న పేర్లు ప్రొటోకాల్‌కు అర్హులవేనా అని ప్రశ్నించారు.

గిరిజన వ్యతిరేకి సంధ్యారాణి

గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ, జగ్గుదొరవలసలో జరుగుతున్న ఏజెన్సీ గ్రామాల సమస్య, జీఓ 3 పునరుద్ధరణ, ఏఎన్‌ఎంల నియామకంపై తొలిసంతకం చేసిన మంత్రి హామీలు నేటికి అమలుకాకపోవడం విచారకరమని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర పేర్కొన్నారు. దీనిపై గిరిజన సంఘాల నాయకులు నిలదీయాలని పిలుపునిచ్చారు. గతంలో మాజీ ఉద్యోగిగా ఉద్యోగుల పక్షాన నిలిచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

గిరిజనులకు ఇచ్చిన హామీల అమలులో మంత్రి విఫలం

రూ.20 లక్షల వ్యయంతో సామాజిక మరుగుదొడ్లు మరమ్మతులు చేయని వైనం

రూ.17కోట్లు వెచ్చించి ఆస్పత్రినిర్మించామంటూ అబద్ధాలు

ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై త్వరలో పార్లమెంట్‌లో ఫిర్యాదు చేస్తాం

మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement