● మసకబారుతున్న నిర్వహణ
● కొన్ని రోజులుగా సరఫా కాని నీరు
● ఇబ్బంది పడుతున్న ప్రజలు
పూసపాటిరేగ: చంపావతి ప్రాజెక్ట్ నిర్వహణ మసకబారుతోంది. ప్రాజెక్ట్ పాడై వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు పనులు చేపట్టకపోవడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండడంతో చంపావతి నదిపై ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్‌పైనే ఎక్కువ మంది ప్రజలు ఆధారపడుతున్నారు. ఒక్క పూసపాటిరేగ మండలంలోనే 20 గ్రామాల ప్రజలకు చంపావతి ప్రాజెక్ట్ ద్వారా నీరు అందించడానికి పైప్‌లైన్లు వేశారు. పదేళ్ల కిందట ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసినప్పటినుంచి తాగునీటి సరఫరా సక్రమంగానే సాగింది. అయితే కొద్ది నెలలుగా ప్రాజెక్ట్ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం..
అధికారుల నిర్లక్ష్యం కారణంగా పూసపాటిరేగ మండల పరిధిలోని 20 గ్రామాల్లో ఏ ఒక్క గ్రామంలో కూడా పూర్తిస్థాయిలో తాగునీటి సరఫరా జరగడం లేదు. ప్రాజెక్ట్ నిర్వహణ కాంట్రాక్ట్‌ను అధికారంలో ఉన్న కీలకనేత అనుచరుడు దక్కించుకోవడం వల్లే ఎవ్వరూ ప్రశ్నించలేని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్ట్‌కు వెంటనే మరమ్మతులు చేపట్టడంతో పాటు నిర్వహణ సక్రమంగా చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ప్రశ్నించలేకపోతున్నారు. ఇదిలా ఉంటే తాగునీటి ఇబ్బందిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నాతవలస వద్ద చంపావతి నది నుంచి పూసపాటిరేగ ఏతపేట సమీపంలో స్టోరేజీ ట్యాంక్‌కు పైపులైన్ల ద్వారా నీరు సరఫరా చేసి, అక్కడ నుంచి మండలంలోని వివిధ గ్రామాలకు నీరు సరఫరా చేయాలి. అయితే సంబంధిత అధికారుల నిర్లక్ష్యం, ఉదాశీనత కారణంగా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
తరుచూ మరమ్మతులే..
చంపావతి ప్రాజెక్ట్ తరచూ పాడవుతోంది. నెలలో కనీసం సగం రోజులు కూడా ప్రాజెక్ట్ నుంచి నీరు సరఫరా కావడం లేదు. కొన్ని రోజులుగా సుదూర ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలి. –ఎస్. గౌరి, గృహణి, పూసపాటిరేగ
తాగునీరు అందించాలి..
ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండడంతో గ్రామంలోని బోర్ల నీటిని వినియోగించలేకపోతున్నాం. ఏళ్ల తరబడి చంపావతి ప్రాజెక్ట్ నీటినే వినియోగిస్తున్నాం. కొద్ది రోజులుగా నీరు సరఫరా కాక ఇబ్బంది పడుతున్నాం. అధికారులు స్పందించి తాగునీరు అందించాలి.
– సీహెచ్ చిన్న, గ్రామస్తుడు, పూసపాటిరేగ


