ఎంత కష్టం..! | - | Sakshi
Sakshi News home page

ఎంత కష్టం..!

Mar 23 2026 8:52 AM | Updated on Mar 23 2026 8:52 AM

వైఎస్సార్‌సీపీ హయాంలో ఇబ్బందుల్లేవు.. కష్టసాధ్యమైన పని

కొండపై గ్రామాలకు తప్పని కష్టాలు

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రేషన్‌ లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేవు. నేరుగా ఇంటింటికీ వెళ్లి ఇవ్వడం జరిగేది. ఇంజిన్‌ సామర్థ్యం ఎక్కువ కలిగిన ఎండీయూ వాహనాలను కొండల పై గ్రామాలకు వెళ్లే విధంగా ఏర్పాటు చేసి, ప్రతి ఒక్కరికీ రేషన్‌ అందజేసే వాళ్లం. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో గిరిజనులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

– విశ్వాసరాయి కళావతి,

మాజీ ఎమ్మెల్యే, పాలకొండ

కొండలపై గ్రామాల్లో గిరిజనులు ప్రతి నెలా సరుకులు తీసుకెళ్లడానికి కింద ఉన్న గ్రామాలకు రావాల్సి ఉంటుంది. మా ప్రాంతంలో చీపురుగూడ, సరిహద్దుగూడ, ఎగువబుడగరాయి, దొండమానుగూడ తదితర గ్రామాలు రేషన్‌ తీసుకోవడానికి దిగువ బుడగరాయి వంటి ప్రాంతాలకు కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది.

– ఎస్‌.సాయికుమార్‌, మాజీ సర్పంచ్‌, మండ

సీతంపేట: చంద్రబాబు జమానాలో కొత్త రేషన్‌ డిపోలను కొండలపై ఏర్పాటు చేసే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. దీంతో గిరిజనులకు రేషన్‌ కష్టాలు తప్పడం లేదు. మళ్లీ కొండలపై నుంచి రేషన్‌ సరుకులు మోసుకెళ్లాల్సి వస్తుంది. పురుషులు ఎక్కువగా కొండపోడు పనుల్లో నిమగ్నం అవుతుండటంతో.. మహిళలే ఎక్కువగా మైదాన ప్రాంతాల్లోని డిపోలకు కాలినడకన వెళ్లాల్సి వస్తోంది. ఆయా గ్రామాల నుంచి వేకువజామున సబ్సిడీ సరుకులు కొనుగోలు చేసుకోవడానికి ఇంటి నుంచి బయలుదేరాల్సి వస్తోంది. తిరిగి నానాపాట్లు పడి ఆయా సరుకులతో స్వగ్రామాలకు కొండలెక్కుతూ సాయంత్రానికి చేరుకునే దుస్థితి ఎదురవుతోంది.

గతంలో ఎండీయూ వాహనాలతో..

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ వెళ్లి రేషన్‌ సరుకులు ఇచ్చేవారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవస్థను రద్దు చేయడంతో గిరిజనులకు కాలినడక కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. గత రెండేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. బరువైన సరుకులు మోసుకుంటూ కొండలపైకి తీసుకెళ్లడం గిరిజన మహిళలకు పరిపాటిగా మారింది. నెల ప్రారంభమైందంటే ఒకటో తేదీ నుంచి 15 వరకు రేషన్‌ దుకాణాలకు వచ్చి బియ్యంతో పాటు ఇంటికి సరిపడా ఇతర సరుకులను కొనుగోలు చేసుకుని తీసుకువెళ్తారు.

గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో..

గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న డీఆర్‌ డిపో (నిత్యావసర సరుకుల దుకాణాలు)లు చాలకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. సీతంపేట జీసీసీ బ్రాంచ్‌ పరిధిలో సీతంపేట, పాతపట్నం పరిధిలో 57 వరకు డీఆర్‌ డిపోలు ఉన్నాయి. ఈ రెండింటిలో 650కి పైగా గిరిజన గ్రామాలు ఉన్నాయి. వీటిలో కొండలపై సుమారు 250 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకు సరిపడా రేషన్‌ డిపోలు కొండలపై లేవు. 10 శాతం గ్రామాలకు మాత్రమే డీఆర్‌ డిపోలు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన వారు మైదాన ప్రాంతాలకు వచ్చి రేషన్‌ తీసుకోవాల్సి వస్తోందని మహిళలు వాపోతున్నారు. ఉన్న రేషన్‌ డిపోలకు సైతం పూర్తి స్థాయిలో సేల్స్‌మెన్‌లు లేరు. రెండేసి డిపోలకు ఒకరు ఇన్‌చార్జ్‌గా వ్యవహరించడంతో 15 రోజుల్లో కొన్ని రోజులు మాత్రమే తెరుస్తారు. దీనివల్ల కూడా గిరిజనాలకు మరిన్ని సమస్యలు ఎదురౌతున్నాయి.

రేషన్‌ కోసం గిరిజనం కష్టాలు

కొండలు దిగి మైదాన ప్రాంతాలకు రావాల్సిందే..

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎండీయూ వాహనాలతో పంపిణీ

చంద్రబాబు ప్రభుత్వంలో కాలినడకన కొండలు దిగాల్సిందే...

నెత్తిన సరుకులు పెట్టుకొని కొండలు ఎక్కాల్సిందే..

చాలా వరకు కొండ దిగువనే గ్రామాలకు డీఆర్‌ డిపోలు ఉన్నాయి. కొండలపై ఉన్న గ్రామాలకు డీఆర్‌ డిపోలు లేకపోవడంతో కొండలపై నివసిస్తున్న మహిళలంతా కొండ దిగువ గ్రామాలకు వచ్చి నిత్యావసర సరకులు కొనుగోలు చేసుకుని తీసుకువెళ్తుంటారు. ఉదయం కొండ పైనుంచి దిగితే మళ్లీ ఇంటికి చేరేసరికి మధ్యాహ్నం 3 గంటలు దాటుతుంది. కొన్ని గ్రామాలకు రోడ్లు వేసినా బస్సులు, ఇతర వ్యాన్లు వంటివి తిరగకపోవడంతో మహిళల కష్టాలు అంతా ఇంతా కావు. చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో ప్రతీ మూడు కిలోమీటర్ల దూరంలో ఒక డీఆర్‌ డిపో పెట్టాలనే ప్రణాళిక ఉన్నతాధికారులు రూపొందించినప్పటకీ ఈ పథకం కార్యరూపం దాల్చకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని మహిళలు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement