నేడు పీజీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు పీజీఆర్‌ఎస్‌

Mar 23 2026 8:52 AM | Updated on Mar 23 2026 8:52 AM

కలెక్టర్‌

రాంసుందర్‌రెడ్డి

విజయనగరం: జిల్లా ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌) నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయి అధికారులందరూ కార్యక్రమంలో పాల్గొని నేరుగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారని పేర్కొన్నారు. గతంలో ఫిర్యాదు చేసిన వారైతే, దానికి సంబంధించిన పాత అర్జీ రశీదును తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. కలెక్టరేట్‌కు రాలేని వారు 1100 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, అలాగే సమీపంలోని మండల, మున్సిపల్‌ కార్యాలయాల్లో కూడా దరఖాస్తులు అందజేయవచ్చని సూచించారు.

భూ సమస్యల కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్‌

ప్రభుత్వ ఆదేశాల మేరకు భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్‌ నిర్వహిస్తున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. ముగ్గురు ఆర్డీవోలు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు, వీఆర్వోలు తమ వద్ద ఉన్న రికార్డులతో ఈ క్లినిక్‌కు హాజరవుతారని రైతులు తమ భూ వివాదాలు, మ్యుటేషన్లు లేదా ఇతర రెవెన్యూ సమస్యల కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు.

విద్యార్థుల భద్రతపై ముందస్తు జాగ్రత్తలు : కలెక్టర్‌

విజయనగరం: జిల్లాలో 10వ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయని, ఇంటర్మీడియట్‌ పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి సూచించారు. పరీక్షల సమయంలో, పరీక్షలు పూర్తయిన తరువాత ఖాళీ సమయాల్లో కొంతమంది విద్యార్థులు చెరువులు, కాల్వలు, ఇతర జల వనరుల వద్దకు వెళ్లి ఈత కొట్టే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను ముందుగానే హెచ్చరించి జాగ్రత్తలు పాటించేలా చూడాలని కోరారు. తెలియని నీటి వనరుల్లో ఈత కొట్టడం ప్రమాదకరమని విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. జిల్లాలోని డీపీఎంలు ముందడుగు వేసి తల్లిదండ్రులు, విద్యార్థులకు మునిగిపోవడం వంటి ప్రమాదాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ సూచించారు. జిల్లా పరిపాలన, విద్యాశాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, మీడియా సంస్థలు సమన్వయంతో విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. పోలీసు, అగ్నిమాపక, ఇతర శాఖల సహకారంతో ప్రమాదకర జలవనరుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై రాష్ట్ర హోం శాఖా మంత్రి రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సంబంధిత ఉన్నతాధికారులతో జరిగిన గత సమావేశంలో కూడా చర్చించామని గుర్తు చేశారు. ఒక అడుగు ముందుకు వేస్తే – ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు అనే సందేశంతో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి విద్యార్థుల ప్రాణ భద్రతకు సహకరించాలని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు.

నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు సర్కార్‌

కొమరాడ: ఉగాది రోజున జాబ్‌ క్యాలెండర్‌ పేరిట చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా మోసం చేసిందని వైఎస్సార్‌సీపీ పార్వతీపురం మన్యం జిల్లా యూత్‌ అధ్యక్షుడు నంగిరెడ్డి శరత్‌బాబు ధ్వజమెత్తారు. మండలంలోని రాజ్యలక్ష్మీపురంలో ఆయన విలేకరులతో ఆదివారం మాట్లాడారు. ఉద్యోగాలు ఇవ్వకుండానే ఇచ్చేశామని ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో మళ్లీ నిరుద్యోగులను మోసపుచ్చిందన్నారు. అధికారంలోకి రాగానే ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కూటమి నేతలు గడిచిన రెండేళ్లుగా ఇచ్చిన ఉద్యోగాల లెక్క తేల్చాలని డిమాండ్‌ చేశారు. కొత్త ఉద్యోగాలు వేయలేదు.. సరికదా.. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిందన్నారు. వలంటీర్లను తొలగించి వారిని రోడ్డు పాల్జేసిందన్నారు. ఎన్నికల సమయంలో రూ.పది వేలు నెలకు ఇస్తామని చెప్పి వలంటీర్లను పూర్తిగా తొలగించిందని ధ్వజమెత్తారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జగనన్న 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఆరు లక్షల 31 వేల 310 ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు. లక్షల మందికి వలంటీర్లుగా నియమించి ఉపాధి ఇచ్చారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement