ఉద్యోగాల పేరిట వంచనపై ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరిట వంచనపై ఫిర్యాదు

Mar 22 2026 2:02 AM | Updated on Mar 22 2026 2:02 AM

ఉద్యోగాల పేరిట వంచనపై ఫిర్యాదు

పార్వతీపురం రూరల్‌: పారిశుధ్య పనుల నియామకాల పేరిట మోసపోయిన బాధితులు శనివారం పార్వతీపురం ఏఎస్పీ మనీషా రెడ్డిని ఉత్తరాంధ్ర గిరిజన సంక్షేమ సంఘం నాయకుడు పి.రంజిత్‌కుమార్‌ నేతృత్వంలో ఆశ్రయించారు. తమను నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన కేటుగాళ్లపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. శ్రీ శబరి నిరుద్యోగ పారిశుధ్య వర్కర్స్‌ సంఘం ప్రతినిధులు గతేడాది జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) ఇచ్చిన ఒక అవగాహన సర్క్యులర్‌ను అడ్డం పెట్టుకుని గిరిజన యువతకు వల వేశారు. కురుపాం, జియ్యమ్మవలస, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం మండలాల్లో సుమారు 75 మంది నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.1.70 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశారు. వీరికి నకిలీ నియామక పత్రాలిచ్చి నాలుగు నెలలుగా పనులు చేయించుకున్నారు. జీతాల విషయమై డీపీవోను సంప్రదించగా.. ప్రభుత్వం నుంచి ఎటువంటి నియామకాలు జరగలేదని తేలడంతో బాధితులు విస్తుపోయారు. సుమారు అరకోటి రూపాయలకు పైగా వసూలు చేసి తమను నట్టేట ముంచారని బాధితులు ఏఎస్పీ ఎదుట వాపోయారు. బీవీవీఎస్‌ సత్యనారాయణమూర్తి, మజ్జి నారాయణరావు, కొండగొర్రి కృష్ణారావు ఈ వసూళ్లకు పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఏఎస్పీ.. తక్షణమే విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. విచారణకు బాధితులు సహకరించాలని ఆమె సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement