రేగిడి: మండల పరిధిలోని ఉణుకూరు గ్రామంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసి పలువురిని గాయపర్చింది. శనివారం గ్రామవీధుల్లో పెద్దలు, పిల్లలు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో కాటు వేసింది. పిచ్చికుక్క దాడిలో గ్రామానికి చెందిన మీసాల వంశీకృష్ణ, కంటు తవిటినాయుడు, దొంతల రాములు, తెంటు సీతాలక్ష్మి, గేదెల ఉమామహేశ్వరరావు, కడగల పెంటమ్మ తదితరులు గాయపడ్డారు. దీంతో బాధితులు ఆస్పత్రులకు పరుగులు తీశారు. పిచ్చికుక్క దాడితో గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
వృద్ధుడి ఆత్మహత్య
విజయనగరం క్రైమ్: విజయనగరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి పోలయ్యపేటలో గంధవరపు కృష్ణ(81) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు వన్‌టౌన్ హెచ్‌సీ రామారావు శనివారం తెలిపారు. కొడుకు పెళ్లి విషయంలో భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ నెల 19వ తేదీన పెళ్లి విషయమై భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తండ్రి ఆ చూకీ కోసం వెతకగా ఉడా కాలనీ వైన్ షాపు వద్ద పడి ఉండటాన్ని చూసి స్థానికులు చూసి కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశారు. ఇంట్లోంచి వెళ్లిపోయిన తండ్రి రెండు రోజులైనా కనిపించకపోవడంతో ఆందోళన చెందుతున్న కు టుంబ సభ్యులకు స్థానికులు చెప్పిన సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లి చూడగా నురగలు కక్కుకొని పడి ఉండటాన్ని చూసిన కుమారుడు కన్నంనాయుడు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తమకందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని హెచ్‌సీ రామారావు తెలిపారు.
స్కూటీ అదుపు తప్పి.. యువతికి గాయాలు
వీరఘట్టం: ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి స్కూటీపై వెళ్తున్న యువతి గాయపడిన ఘటన శనివారం వీరఘట్టం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం.. తెట్టంగి గ్రామానికి చెందిన యువతి ఆమె బంధువుతో కలిసి స్కూటీపై రేగులపాడు – యు.వెంకమ్మపేట రహదారిలో పార్వతీపురం వెళ్తోంది. ఈ క్రమంలో రేగులపాడు దాటిన తర్వాత ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి స్కూటీ అదుపు తప్పింది. దీంతో వెనుక కూర్చున్న యువతి రోడ్డుపై పడిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు వెంటనే బాధితురాలిని వీరఘట్టంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.


