25న జాబ్‌ మేళా | - | Sakshi
Sakshi News home page

25న జాబ్‌ మేళా

Mar 22 2026 2:01 AM | Updated on Mar 22 2026 2:01 AM

పార్వతీపురం: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో యువతకు ఉపాధిని కల్పించేందుకు ఈ నెల 25న పార్వతీపురంలోని గాయత్రి డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళాను నిర్వహించనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయి కృష్ణచైతన్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్‌ మేళాలో 10 కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ, ఐటీఐ చదువుకుని, 18 నుంచి 28 ఏళ్లు వయస్సు ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు జాబ్‌ మేళాకు హాజరు కావచ్చునన్నారు. ఆసక్తి గల వారు హెచ్‌టీటీపీఎస్‌://నైపుణ్యం.ఏపీ.జీఓవీ.ఇన్‌లో వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. రిఫరెన్స్‌ నంబరుతో పాటు బయోడేటా, ఆధార్‌ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు, పాసుపోర్టు సైజు ఫొటోతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు. వివరాల కోసం 9177297528 నంబరును సంప్రదించాలని సూచించారు.

గ్యాస్‌ సరఫరాపై ఆందోళన అక్కర్లేదు..: కలెక్టర్‌

పార్వతీపురం: జిల్లాలో గృహ వినియోగదారులకు గ్యాస్‌ కొరత లేదని, డిమాండ్‌కు సరిపడా సరఫరా జరుగుతుందని కలెక్టర్‌ డా. ఎన్‌.ప్రభాకరరెడ్డి శనివారం తెలిపారు. గ్యాస్‌ను పొదుపుగా వాడుకోవాలని, అవసరం మేరకు మాత్రమే గ్యాస్‌ కొనుగోలు చేయాలని, ఆందోళన చెంది అనవసరంగా బుకింగ్‌ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. డిమాండ్‌, సప్‌లైలో అంతరాన్ని తగ్గించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని సివిల్‌ సప్‌లై అధికారులకు ఆదేశించారు.

విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

సీతానగరం: విద్యార్థులు చదువుతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలకు శ్రద్ధచూపాలని జిల్లా సైన్స్‌ ఆఫీసర్‌ గిరడ లక్ష్మణరావు పిలుపునిచ్చారు. మండలంలోని జోగింపేట కేజీబీవీ విద్యాలయంలో ప్రిన్సిపాల్‌ జె.సంధ్య అధ్యక్షతన శనివారం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ, సమగ్రశిక్ష వారి సౌజన్యంతో డీఈఓ పి.బ్రహ్మాజీరావు ఆదేశాల మేరకు జిల్లాలోని 25 ఏటీఎల్‌ స్కూల్స్‌లో మూడు రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు. ఏటీఎల్‌ అవగాహన పెంపొందించడం, విద్యార్థినులకు హాండ్స్‌ అన్‌ ఎక్సీపీరియన్స్‌ కింద నూతన ఆవిష్కరణలపై శిక్షణ ఇచ్చారు. ఆటోమేటిక్‌ వాట్సాప్‌ సెన్సార్‌తో పనిచేసే విధానం, బోట్‌ తయారీ, కిచైన్‌ మోల్డింగ్‌, మాగ్నిటిక్‌ రీడ్‌ సెన్సార్‌ విధానం, వాటర్‌ దియా తయారీపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎల్‌టీఏ ఇన్‌చార్జి శైలజ పాల్గొన్నారు.

మాతా, శిశు సంరక్షణపై శిక్షణ

పార్వతీపురం రూరల్‌: జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల స్టాఫ్‌నర్సులకు మాతా, శిశు ఆరోగ్య సేవలపై నిర్వహించిన వివిధ శిక్షణ కార్యక్రమాలు శనివారంతో ముగిశాయి. శిక్షణ పొందిన వారికి జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయంలో ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రసవ సమయంలో తలెత్తే సమస్యల నివారణ, బాలింతలు, నవజాతి శిశువుల సంరక్షణ, హైరిస్క్‌ కేసుల గుర్తింపుపై నర్సులకు అవగాహన కల్పించామన్నారు. ఎస్‌బీఏ (21 రోజులు), దక్షత (6రోజులు), ఎన్‌ఎస్‌ఎస్‌కే (3 రోజులు) విభాగాల్లో శిక్షణ ఇచ్చామన్నారు. మాతా, శిశు మరణాల నివారణే లక్ష్యంగా మెరుగైన సేవలందించాలని సిబ్బందికి సూచించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగ శివజ్యోతి పర్యవేక్షణలో గైనకాలజిస్టులు, పిడియాట్రీషియన్లు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో వైద్యాధికారులు విజయ్‌మోహన్‌, జగన్మోహనరావు, వినోద్‌కుమార్‌, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement