ఎండు ఉసిరి కిలో రూ.90 | - | Sakshi
Sakshi News home page

ఎండు ఉసిరి కిలో రూ.90

Mar 21 2026 5:13 AM | Updated on Mar 21 2026 5:13 AM

పంట దిగుబడి తగ్గింది ఎండు ఉసిరి ఉత్పత్తి లేదు..

కిలోకు రూ.30 ధర పెంచిన జీసీసీ

ఎండు ఉసిరి తయారీలో గిరిజనుల నిమగ్నం

పంట దిగుబడి లేదంటున్న ఉసిరి రైతులు

సీతంపేట: ఎండు ఉసిరి ధరను గిరిజన సహకార సంస్థ పెంచింది. గత సీజన్లో కిలో ఎండు ఉసిరిని రూ.60కు కొనుగోలు చేసిన జీసీసీ ఏకంగా రూ.30 పెంచి రూ.90కి కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. జీసీసీ ధరలు పెంచడంతో మైదాన ప్రాంతాల వ్యాపారులు సైతం ఇదే అదునుగా కిలోకు రూ.2 నుంచి రూ.5 వరకు అదనంగా మద్దతు ధర పెంచి కొనుగోలు చేస్తున్నారు. అయితే, తూకంలో మోసాల వల్ల నష్టపోతున్నామని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొండపోడులో సాగైన ఉసిరికి కాయలు పచ్చివి ప్రస్తుతం కావిడ రూ.400ల నుంచి రూ.500లకు విక్రయిస్తున్నామని, గతేడాది ఒక్కో కావిడ ధర రూ.700 పలికేదని రైతులు చెబుతున్నారు.

ఎండు ఉసిరి తయారీ కష్టమే...

ఎండు ఉసిరి తయారీ కష్టమే. పచ్చి ఉసిరి విక్రయించగా మిగిలిన ఉసిరిని చిదకగొట్టిన తర్వాత ఎండలో పక్షం రోజుల పాటు ఆరవేసిన తర్వాత ఎండుఉసిరిగా మారుతుంది. దీనిని మార్కెట్‌కు తరలించి అమ్మకాలు చేస్తాం. గిట్టుబాటు ధర ఉంటే జీసీసీకే విక్రయిస్తామని, లేని పక్షంలో వ్యాపారులకు అమ్మకాలు జరుపుతామని గిరిజనులు తెలిపారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిశా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇక్కడకు వచ్చి పంటను కొనుగోలు చేస్తారు.

ఉసిరి పంట అంతగా లేదు. ఎండు ఉసిరి తయారీ కష్టంగా ఉంది. గతంలో పండేదంటే జీసీసీ ఎటువంటి ధరలు పెంచలేదు. ఇప్పుడు పెంచినప్పటికీ అంత దిగుబడులు లేకపోవడంతో ఏటా గిరిజన రైతులకు నష్టాలు తప్పడం లేదు. పచ్చి ఉసిరిని ఎండు ఉసిరిగా తయారు చేయడం కష్టసాధ్యమైన పని. – జోషి, అడ్డంగి

ఎండు ఉసిరి కొనుగోలుకు చర్యలు తీసుకుంటాం. గతంలో వలే ఇప్పుడు మార్కెట్‌కు ఉత్పత్తి రావడం లేదు. గిరిజనులు తీసుకువస్తే తప్పనిసరిగా కొనుగోలు చేస్తాం. తమశాఖ ఉన్నతాధికారులు ఎండుఉసిరి ధరలు పెంచారు. ఎంతమేర ఉత్పత్తి చేసినా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.

– డి.కృష్ణ, జీసీసీ డీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement