పార్వతీపురం రూరల్: రంజాన్ పండగ సందర్భంగా శనివారం ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించిన నేపథ్యంలో... ఆ రోజు జరగాల్సిన పదోతరగతి ఇంగ్లిష్ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా పడినట్టు డీఈఓ పి.బ్రహ్మాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష సమయం యథాతథంగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని కోరారు.
30కి ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్ష వాయిదా
పార్వతీపురం రూరల్: రంజాన్ సందర్భంగా ఈ నెల 21న ప్రభుత్వం సెలవు ప్రకటించిన నేపథ్యంలో ఆ రోజు జరగాల్సిన ఏపీ ఓపెన్ స్కూల్ పరీక్షలను వాయిదా వేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి పి. బ్రహ్మాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 21న జరగాల్సిన 211 గణితం, 223–భారతీయ సంస్కృతి, వారసత్వము పరీక్షలను ఈనెల 30వ తేదీ (సోమవారం) ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆయా కేంద్రాల్లోనే ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. పరీక్షల వాయిదా సమాచారాన్ని ప్రతివిద్యార్థికి చేరవేయాలని ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులను డీఈఓ ఆదేశించారు. ఈనెల 21న విధులకు కేటాయించిన ఇన్విజిలేటర్లు సిబ్బంది అందరూ యథావిధిగా 30వ తేదీన తమ విధులకు హాజరు కావాలని, పరీక్ష కేంద్రాల్లో అవసరమైన లాజిస్టిక్ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు.
అల్లాహ్ విశ్వాసకులకు రంజాన్ శుభాకాంక్షలు
● జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం: ఆధ్యాత్మిక చింతన, త్యాగం మానవత్వానికి ప్రతీకగా నిలిచే రంజాన్ పండగ ప్రజలందరిలోనూ వెలుగులు నింపాలని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) ఆకాంక్షించారు. శనివారం పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్యాత్మిక చింతన, క్రమశిక్షణ, దానగుణం, సోదరభావానికి రంజాన్ పండగ ప్రతీక అని కొనియాడారు. పేదలకు చేసే సహాయమే ఈ పండుగలోని అసలైన పరమార్థమని, మానవత్వమే మతమని చాటిచెప్పే గొప్ప పండగ రంజాన్ అని ఆయన పేర్కొన్నారు. అల్లాహ్(భగవంతుని) దయ అందరిపైనా ఉండాలని, జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని, ప్రజల్లో మత సామరస్యత పెంపొందాలన్నారు.
ఈవీఎం గోదాముల తనిఖీ
నెల్లిమర్ల: ఈవీఎం గోదాములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. మూడు నెలలకోసారి గోదాముల తనిఖీలో భాగంగా గోదాము షట్టర్లకు అమర్చిన సీల్స్, తాళాలను తెరిపించి లోపలి గదులను, ఈవీఎం యంత్రాల నిల్వను సమగ్రంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేకంగా సమీక్షించారు. గోదాం పరిసర ప్రాంతాలను సీసీ కెమెరాల ద్వారా పరిశీలించి, అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులకు, పోలీస్ సిబ్బందికి సూచించారు.


