విజయనగరం టౌన్: పవిత్ర రంజాన్ మాసం శుక్రవారం షవ్వాల్ మాసం చంద్ర దర్శనంతో ముగిసింది. భారతదేశంలో యావత్ ప్రపంచ ముస్లింలు శనివారం ఈదుల్ ఫితర్ నిర్వహించుకోనున్నారు. నెల రోజుల పాటూ కఠోర ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి, అత్యంత భక్తిభావంతో మెలిగిన ప్రతీ ముస్లిం సోదరుడు పవిత్రమైన రంజాన్ పండగ కోసం వేచి చూస్తాడు. ఎందరో నిరుపేదలకు దానధర్మాలు చేసి, ప్రత్యేక ప్రార్ధనలు చేసి, ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఆనంద పరవశులవుతారు. భారతదేశ సౌభ్రాత్వత్వానికి ప్రతీకగా అంతా మంచి జరగాలని ప్రార్ధనలు నిర్వహిస్తారు. నెల రోజుల పాటూ చేసే ఉపవాస దీక్షలు, దానధర్మాలు ఏడాది పాటూ చేసేందుకు నెలరోజుల దీక్ష ఎంతగానో ఉపయోగపడతాయని విశ్వసిస్తారు. పవిత్ర రంజాన్ పండగను శనివారం నిర్వహించేందుకు ముస్లిం పెద్దలు నిర్ణయించుకున్నారు. జిల్లాలోని అన్ని మసీదుల్లోనూ, ఈద్‌గాల్లోనూ ప్రత్యేక ప్రార్ధనలకు సిద్ధం చేశారు. మసీదులన్నీ విద్యుత్ కాంతులతో శోభాయమానంగా వెలిగిపోతున్నాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా ముస్లిం సోదరులందరూ రంజాన్ వేడుకలకు సిద్ధమవుతున్నారు.
ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఈద్‌గాలో..
జిల్లా కేంద్రమైన విజయనగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న ఈద్‌గాలో ముస్లిం సోదరులందరూ ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తుంటారు. కణపాక ఈద్‌గా, చోటీ మసీదు, జామియా మసీదు, మెహమాన్ మసీదు, డకినివీధి మసీదు తదితర ప్రాంతాల్లో వైభవంగా రంజాన్ వేడుకలు నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
ఉదయం 7.30 గంటల నుంచే...
ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఈద్‌గాలో ఉదయం 7.30 గంటలకు, జామియా మసీదులో 8 గంటలకు ప్రత్యేక ప్రార్ధనలు చేయనున్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్ధనలు చేయనున్నారు.
పూర్తయిన ఏర్పాట్లు
ముస్తాబయిన మసీదులు
ఈద్‌గాలో ప్రత్యేక ప్రార్ధనలు
మసీదు, ఈద్‌గాల్లో నేటి ఉదయం 7.30 నుంచే నమాజ్‌లు
నేడు పవిత్ర రంజాన్ పర్వదినం
బోధనలకనుగుణంగా జీవితాన్ని గడపాలి
ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసంలో ఖురాన్ బోధనలను విన్నారు. ఖురాన్ బోధనలకు అనుగుణంగా తమ జీవితాన్ని గడపాలి. అదే రంజాన్ ప్రత్యేక సందేశం. మానవులంతా సమానమేనని, ఈదుల్ ఫిత్ర్ పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ దాన ధర్మాలు చేయాలని పండగ సూచిస్తుంది. సమత, మమతలకు అద్దం పడుతుంది. దేవున్ని స్మరి ప్రతీ ముస్లిం సోదరుడు ఆనందంతో నిర్వహించుకునే పండగ.
– మహమ్మద్ హబీబ్, జమాతే ఇస్లామీ హింద్ సంస్థ ప్రతినిధి, విజయనగరం


