దొంగతనానికి వెళ్లి జారిపడి మృతి చెందిన వ్యక్తి | - | Sakshi
Sakshi News home page

దొంగతనానికి వెళ్లి జారిపడి మృతి చెందిన వ్యక్తి

Mar 21 2026 5:13 AM | Updated on Mar 21 2026 5:13 AM

విజయనగరం క్రైమ్‌ : విజయనగరం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దొంగతనం చేసేందుకు బహుళ అంతస్తుల భవనం ఎక్కి అక్కడ నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన దాసన్నపేటలో శుక్రవారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాలు.. దాసన్నపేట ఫుడ్‌ కార్పొరేషన్‌ గోదాం సమీపంలో దాట్ల ఆస్పత్రి వెనుక ఓ ఇంట్లో దొంగతనం చేసేందుకు 55 సంవత్సరాల వ్యక్తి టెర్రస్‌ మీదకు వెళ్లాడు. అక్కడ చిన్న స్లోప్‌ ఉండడంతో రాత్రి కావడంతో చీకట్లో అది కనిపించకపోవడం జారిపడి కింద పడిపోయాడు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న టూ టౌన ఎస్‌ఐ కృష్ణమూర్తి ఘటనా స్థలికి వెళ్లారు. అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్టు గుర్తించారు. అక్కడ క్లోజడ్‌ సర్క్యూట్‌ కెమెరాను పరిశీలించారు. దొంగతనం చేసేందుకు వచ్చినట్టు గుర్తించారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 9121109438, 9121109420 ఫోన్‌ నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ కోరారు.

గోడ కూలి బాలుడు మృతి

కొమరాడ: మండలంలోని ఆర్తాం గ్రామంలో ఓ ఇంటి గోడ కూలి తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. ఆర్తాం గ్రామంలో ఒడిశా నుంచి వచ్చి కూలి పనులు చేసుకుంటూ బిడ్డక కొండ, జ్యోతి దంపతులు నాలుగేళ్లుగా నివసిస్తున్నారు. వీరికి తొమ్మిదేళ్ల బాలుడు బిడ్డిక హేమంత్‌ ఉన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వీరు అద్దెకుంటున్న ఇంటి బాత్‌రూమ్‌ గోడ కూలిపోయింది. ఆ సమయంలో సమీపంలో ఆడుతున్న హేమంత్‌ (9)పై గోడ కూలిపోయింది. దీంతో బాలుడి తలకు తీవ్ర గాయమైంది. చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొమరాడ ఎస్‌ఐ జగదీష్‌నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

విజయనగరం క్రైమ్‌: విజయనగరం పరిధిలోని రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రణాళికా బద్దమైన చర్యలు చేపడుతున్నట్టు ఎస్పీ దామోదర్‌ శుక్రవారం తెలిపారు. విజయనగరం ఇన్‌చార్జ్‌ డీఎస్పీ గోవిందరావుతో కలిసి చెల్లూరు, వై జంక్షన్‌, మోదవలస, గంట్యాడ చెక్‌పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా ప్రాంతాల్లో రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్‌ బ్రేకర్లతో పాటు స్టాపర్లు పెట్టాలని స్థానిక పోలీసులను ఆదేశించారు. ప్రమాద నియంత్రణకు స్పీడ్‌ బ్రేకర్లతో పాటు జీబ్రా లైన్లు వేయాలని సూచించారు. ప్రమాదాలు జరిగే దాదాపు 20 బ్లాక్‌ స్పాట్‌లను ఎస్పీ గుర్తించారు. చెల్లూరుతో పాటు బైపాస్‌రోడ్డు జంక్షన్‌, అయినాడలలో ఈ స్పాట్‌లను గుర్తించారు. ప్రమాదాల నివారణకు వాహనదారులు కనీస జాగ్రత్తలు పాటించాలన్నారు. మద్యం సేవించి పట్టుబడితే రూ.10వేల జరిమానాతో పాటు జైలు శిక్ష ఖాయమని హెచ్చరించారు. ఎస్పీతో పాటు ఎస్‌బీ సీఐ లీలారావు, భోగాపురం సీఐ రామకృష్ణ, విజయనగరం రూరల్‌ సీఐ లక్ష్మణరావు, ఎస్‌ఐలు అశోక్‌, సన్యాసినాయుడు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు

నెల్లిమర్ల రూరల్‌: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీసీతారామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి కల్యాణ వసంతోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం వేకువజామున స్వామికి ప్రాతఃకాలార్చన, బాలభోగం నిర్వహించినానంతరం వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన 40 మంది వేద పండితులచే శ్రీమద్రామాయణ పారాయణాలు, సుందరాకాండ పారాయాణం, దివ్య ప్రబంధ సేవా కాలములు, తులసీదళార్చన, కుంకుమార్చనలు జరిపించారు. యాగశాలలో గాయత్రీ రామాయణం, సంక్షేప రామాయణం, సుందరకాండ హవనం తదితర కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement