విజయనగరం గంటస్తంభం: ఉగాది సందర్భంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై ఏఐవైఎఫ్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు.., డూప్ క్యాలండర్ అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. నగరంలోని సీపీఐ అమర భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూర వాసు, ఉపాధ్యక్షుడు వెలగాడ రాజేష్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. నిరుద్యోగులు అడుగుతున్నవి పెద్ద కోరికలు కావని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే కోరుతున్నారని తెలిపారు. రెండు సంవత్సరాలు గడిచినా కేవలం 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం నిరుద్యోగ యువతను నిరాశకు గురి చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న గంజాయి సమస్యను నిర్మూలిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. డ్రగ్స్ నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని, ప్రజలను గాలికి వదిలేసినట్టుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మెడికల్ మాఫియాపై కూడా వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా నడుస్తున్న ఆస్పత్రులు, మెడికల్ షాపులు ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయని చెప్పారు. కాలం చెల్లిన మందులను విక్రయించడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరచి యువతకు ఇచ్చిన హామీలను అమలు చేసి న్యాయం చేయాలని, లేని పక్షంలో భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏఐవైఎఫ్ సహాయక కార్యదర్మి గంగరాజు, రవి, వినోద్, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.
ఉగాది గిఫ్ట్ కాదు..యువతను మోసం చేసే డూప్ క్యాలెండర్
డ్రగ్స్ నిర్మూలనలో వైఫల్యం..
మెడికల్ మాఫియా విజృంభణ
ఎన్నికల హామీలు మరిచిన ప్రభుత్వం
ఏఐవైఎఫ్ ఆగ్రహం


