ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ఉపకార వేతనాలు | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ఉపకార వేతనాలు

Feb 11 2026 8:14 AM | Updated on Feb 11 2026 8:14 AM

ఎస్సీ విద్యార్థులకు కేంద్ర  ఉపకార వేతనాలు

ఎస్సీ విద్యార్థులకు కేంద్ర ఉపకార వేతనాలు

17న జిల్లాస్థాయి చదరంగం పోటీలు గోడపై నుంచి జారిపడి వ్యక్తి మృతి

కలెక్టర్‌ ప్రభాకర రెడ్డి

పార్వతీపురం రూరల్‌: జిల్లాలోని షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థుల విద్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రీ–మెట్రిక్‌, పోస్ట్‌–మెట్రిక్‌ ఉపకార వేతనాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ డా. ఎన్‌.ప్రభాకర రెడ్డి ఒక ప్రకటనలో కోరారు. 9, 10 తరగతులు చదివే ఎస్సీ విద్యార్థులు (వార్షిక ఆదాయం రూ. 2.50 లక్షల లోపు) డే–స్కాలర్లుగా రూ.3,500, హాస్టలర్లుగా రూ.7,000 వరకు పొందవచ్చని తెలిపారు. అపరిశుభ్ర, ప్రమాదకర వృత్తుల్లోని వారి పిల్లలకు 1 నుంచి 10 తరగతుల వరకు కుల, ఆదాయ పరిమితి లేకుండా రూ.8,000 వరకు ఆర్థిక సాయం అందుతుందన్నారు. ఇక ఉన్నత చదువులు చదివే (ఇంటర్‌ నుంచి పీజీ వరకు) విద్యార్థులకు పూర్తి బోధన రుసుముతో పాటు ఏడాదికి గరిష్టంగా రూ. 13,500 వరకు విద్యా భత్యం లభిస్తుందని వివరించారు. దివ్యాంగ విద్యార్థులకు అన్ని విభాగాల్లో అదనంగా 10 శాతం భత్యం ఉంటుందన్నారు. లబ్ధిదారులు ఆధార్‌ అనుసంధానమైన బ్యాంకు ఖాతా, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు సోషల్‌ జస్టిస్‌ డాట్‌ జీఓవీ డాట్‌ ఇన్‌/స్కీమ్స్‌/23) వెబ్‌సైట్‌ను చూడవచ్చని కలెక్టర్‌ పేర్కొన్నారు.

శాంతిభద్రతలపై ఎస్పీ సమీక్ష

పార్వతీపురం రూరల్‌: జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీస్‌ అధికారులతో మంగళవారం నిర్వహించిన వర్చువల్‌ సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాలు, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు నిఘా పెంచాలన్నారు. పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి 60 రోజుల్లోపు చార్జిషీట్లు దాఖలు చేయాలని, సిబ్బంది అందరూ సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని ఎస్పీ స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, వివిధ విభాగాల సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

పార్వతీపురం రూరల్‌: జిల్లా కేంద్రంలో ఈనెల 17న జిల్లా స్థాయి ’శాప్‌’ లీగ్స్‌ చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి డా కె.శ్రీధర్‌ రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్‌ డా.ఎన్‌ ప్రభాకర రెడ్డి ఆదేశాల మేరకు పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదురుగా ఉన్న ఆర్సీఎం పాఠశాల ప్రాంగణంలో ఆ రోజు ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయి. జిల్లాకు చెందిన 13, 15, 17, 19 ఏళ్ల వయస్సు గల బాలురు, బాలికలు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఇతర వివరాల కోసం ఫోన్‌ 7396423490 నంబరును సంప్రదించాలని సూచించారు.

పార్వతీపురం రూరల్‌: చిక్కుడు కాయలు కోయబోయి ప్రమాదవశాత్తు గోడపై నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ ఘటనపై పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నాయుడు వీధికి చెందిన పి.రాము (60) తన ఇంటి వెనుక ఉన్న చిక్కుడు పాదు నుంచి కాయలు తెంపేందుకు మంగళవారం సమీపంలోని గోడ ఎక్కాడు. ఈ క్రమంలో అదుపుతప్పి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు వెంటనే జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం విజయనగరంలోని కేంద్రాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement