బొబ్బిలి: అమరావతిని రాజధానిగా చట్టబద్ధం చేశామని చెబుతున్న కూటమి నాయకులు.. మరి ఇన్నాళ్లూ ప్రజలను మోసం చేశారా అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని బొబ్బిలి, రామభద్రపురం, తెర్లాం, బాడంగి మండలాలకు చెందిన చేసిన సర్పంచ్‌లను శుక్రవారం స్థానిక శ్రీసూర్య రెసిడెన్సీలో ఘనంగా సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో నోటికొచ్చిన హామీలిచ్చి వేటినీ అమలు చేయలేదన్నారు. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో అమరావతికి చట్టబద్ధత అంటూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండడంతో కూటమి నాయకులు ప్రజలను మభ్యపెట్టడానికి కుట్రలు పన్నుతారన్నారు. రాజధానిలో భవనాలు నిర్మించామన్నారు.. రంగులేశామన్నారు..ఇప్పుడేమో పార్లమెంట్‌లో చట్టబద్ధత చేశామంటున్నారని ఎద్దేవా చేశారు. రాజధానికి ఇప్పుడు చట్టబద్ధత చేశారంటే..మరి ఇన్నాళ్లూ ప్రజలను మోసం చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. రాజధాని పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రూ. 2,400 మద్దతు ధర ప్రకటించిన ప్రభుత్వం మొక్కజొన్న దిగుబడిని కొనుగోలు చేయకపోవడం అన్యాయమన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మొక్కజొన్నకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు రైతుల కష్టాలను తీర్చలేని దద్దమ్మలని ఎద్దేవా చేశారు. గ్యాస్ లేక మహిళలు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు మాత్రం ఎక్కడబడితే అక్కడ గ్యాస్ దొరుకుంతుందని చెప్పడం విచారకరమన్నారు. అలాగే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని తెలిపారు. ప్రజా సంక్షేమం లేక పల్లెలు డీలా పడ్డాయన్నారు. వీటన్నింటినీ తిప్పికొట్టాలంటే మళ్లీ వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హయాంలోని ప్రభుత్వం రావాలన్నారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు.
ఇప్పుడు చట్టబద్ధత అంటే.. ఇన్నాళ్లూ
ప్రజలను మోసం చేశారా..?
ఎన్నికల హామీలు అమలు చేయని కూటమి నాయకులు
జిల్లాలోని ఎమ్మెల్యేలు రైతుల కష్టాలు తీర్చలేని దద్దమ్మలు
జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
జగన్ మోహన్‌రెడ్డి ధైర్యశీలి.. : పరిశీలకుడు జగన్నాథం
వైఎస్సార్‌సీపీ బొబ్బిలి పరిశీలకుడు రొంగలి జగన్నాథం మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనాను ధైర్యంగా ఎదుర్కొని సమర్థ పరిపాలన సాగించిన ధైర్యశీలి జగన్ మోహన్‌రెడ్డి అని కొనియాడారు. సచివాలయాలు, వలంటీర్లతో గాంధీ కలలుగన్న సుపరిపాలన తీసుకువచ్చాడన్నారు. అటువంటి వ్యక్తిని మరోసారి సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని సర్పంచ్‌లను సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యుడు ఇంటి గోపాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శంబంగి వేణుగోపాలనాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎస్వీ మురళీ కృష్ణారావు, ఎంపీపీలు చొక్కాపు లక్ష్మణరావు, నర్సుపల్లి ఉమాలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యులు పెద్దింటి రామారావు, శాంతకుమారి, సరస్వతి, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు చోడిగంజి రమేష్‌నాయుడు, బొబ్బిలి, బాడంగి మండల పార్టీ అధ్యక్షులు తమ్మిరెడ్డి దామోదరరావు, యామలి శివప్రసాద్, సీనియర్ నాయకులు మర్రాపు జగన్నాథం, నర్పుపల్లి బాబ్జీ, తెర్లాం మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు తెంటు సత్యం నాయుడు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జి. చంద్రవదన, డబ్ల్యూవీఎల్‌ఎన్ రాయలు, మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మీరే మళ్లీ సర్పంచ్‌లు: మాజీ ఎంపీ బెల్లాన
మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపరిపాలనలో భాగస్వామ్యులైన సర్పంచ్‌లందరూ మళ్లీ ఎన్నికల్లో గెలవాలని ఆకాంక్షించారు. పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగాలని మాజీ సర్పంచ్‌లకు సూచించారు.
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఏమైంది..? : మాజీ ఎమ్మెల్యే శంబంగి
మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మాట్లాడుతూ.. నలబైభె ఏళ్ల చరిత్ర ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు.. రేపో మాపో పదవీకాలం పూర్తయ్యే సర్పంచ్‌లకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. కొత్తగా వచ్చిన సర్పంచ్‌లకు ఇవ్వాల్సిన శిక్షణను రెండు నెలల్లో పదవీ విరమణ చేసే వారికి ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు.


