వృథాగా.. నాగావళి నీరు
మొరాయిస్తున్న షట్టర్లు
వీరఘట్టం: ప్రతీ ఏటా ఖరీఫ్‌లో తోటపల్లి ప్రాజెక్టులో కుడి, ఎడమ కాలువ పరిధిలో ఉన్న పాత ఆయకట్టులో సాగునీటి కోసం రైతులు అవస్థలు పడుతునే ఉన్నారు. శివారు ఆయకట్టుకు సకాలంలో నీరందక రైతులు రోడ్డెక్కుతునే ఉన్నారు. ఇంతలో ఖరీఫ్ ముగిసేలోపు శివారు ఆయకట్టుకు నీరందిస్తున్నారు. అయితే ఖరీఫ్ ముగిసిన తర్వాత కూడా కాలువల ద్వారా నిరంతరంగా సాగునీరు పంట పొలాల్లోకి వస్తుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కోత కోసిన వరి పంటను కుప్పలుగా వేయగా నాగావళి నీరు కుప్పల చుట్టూ చేరడంతో శివారు ప్రాంత రైతులు నూర్పులు చేసేందుకు అవస్థలు పడుతున్నారు. ఖరీఫ్‌లో సకాలంలో నీరందక ఇబ్బందులు పడిన తమకు ఇప్పుడు పొలంలో ఉన్న పంటను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల నవంబర్ 15తో ఖరీఫ్ సీజన్ ముగిసినా కుడి, ఎడమ కాలువల గుండా నీటి సరఫరా ఆగకుండా రావడంతో ప్రస్తుతం వేసిన అపరాల పంటలకు నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఏం జరుగుతోంది..
తోటపల్లి జలాశయం నుంచి పాత ఆయకట్టుకు నీరందించే కుడి, ఎడమ కాలువల రెగ్యులేటర్ల షట్టర్లు మరమ్మతులకు గురయ్యాయి. ఖరీఫ్ సీజన్‌లో ఎడమ కాలువ ద్వారా 400 క్యూసెక్కులు, కుడి కాలువ ద్వారా సీజన్‌లో నీటిని విడిచిపెట్టారు. ప్రస్తుతం సీజన్ ముగియడంతో నీటిని నిలుపుదల చేసేందుకు షట్టర్లు మొరాయిస్తుండడంతో ఇటీవల షట్టర్లు ఆపరేట్ చేశారు. కొంత వరకు షట్టర్లు కిందకు దిగి ఆగిపోయాయి. దీంతో ప్రస్తుతం ఎడమ కాలువకు 200 క్యూసెక్కుల నీరు, కుడి కాలువకు 60 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ నీటిని కంట్రోల్ చేయలేక జల వనరుల శాఖ అధికారులు చేతులెత్తేసారు. దీంతో గత నెల రోజులుగా కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీరు వృథాగా పోతోంది. అంతేకాకుండా పొలాల్లో వేసిన వరి కుప్పలు చుట్టూ నీరు చేరడంతో నూర్పులు చేసేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు.
నెల రోజులుగా వృథా
గత నెల రోజులుగా తోటపల్లి ప్రాజెక్టు నుంచి 0.66 టీఎంసీల నీరు వృథాగా ప్రవహిస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. పాత ఆయకట్టులోని ఎడమ కాలువ ద్వారా 200 క్యూసెక్కులు నీరు విడిచి పెడుతున్నారు. ఈ లెక్కన గత నెల రోజులుగా ఎడమ కాలువ 0.51 టీఎంసీలు నీరు వృథాగా పోతోంది. అలాగే కుడి కాలువ ద్వారా 60 క్యూసెక్కులు నీటిని విడిచి పెడుతున్నారు. ఈ లెక్కన గత నెల రోజులుగా కుడి కాలువ 0.15 టీఎంసీల నీరు వృథా అవుతోంది. మొత్తం కుడి, ఎడమ కాలువల నుంచి గత నెల రోజులుగా 0.66 టీఎంసీల నీటి వృథా జరుగుతోంది. తోటపల్లి ప్రాజెక్టు నీటి సామర్థ్యం 2.5 టీఎంసీలు కాగా ఆదివారం నాటికి నీటి నిల్వ 2.1 టీఎంసీలు ఉంది. నీటి వృథాను అరికట్టకపోతే రానున్న వేసవికి నీటి ఎద్దడి తప్పదని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.
ఎగువ ప్రాంతంలో
ప్రారంభమైన రెండో పంట
కుడి, ఎడమ కాలువలకు ఎగువ ప్రాంతంలో (1వ బ్రాంచ్ దిగువ ప్రాంతం) ప్రతీ ఏటా ఖరీఫ్ సీజన్ తొందరగా ప్రారంభమై, దిగువ ప్రాంతం కంటే వేగంగా ముగుస్తోంది. వెంటనే వీరు రెండో పంటగా వరినే వేస్తున్నారు. వీరికి నీరందించేందుకు కొంత మంది అధికారులు ముడుపుల కోసం షట్టర్లు మరమ్మతులకు గురైనట్టు చెబుతున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రతీ ఏటా ఖరీఫ్ ముగిసినా షట్టర్లు మూతపడకపోవడం, కొంత కాలం తర్వాత మళ్లీ మూతపడడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
తోటపల్లి ప్రాజెక్టు వద్ద పాత రెగ్యులేటర్లు మరమ్మతులకు గురయ్యాయి. నీటి నిలుపుదల చేయడం సాధ్యం కావడం లేదు. ఈ షట్టర్లు మరమ్మతులకు రూ.18 లక్షలతో టెండర్లు పిలిచాం. ఎవరూ ముందుకు రాలేదు. పూర్తి వివరాలతో ఓ నివేదికను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి, షట్టర్లు మరమ్మతులు చేపట్టి, నీటి వృథాను అడ్డుకుంటాం.
– డి.వి.రమణ, ఏఈ,,
కుడి, ఎడమ కాలువల పర్యవేక్షణ ఇంజినీరు
ప్రస్తుతం తోటపల్లి జలాశయం పరిధిలోని రెగ్యులేటర్లు మొరాయిస్తుండడంతో నీటి సరఫరాను కంట్రోల్ చేయలేకపోతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ఈ షట్టర్లు మరమ్మతులకు రూ.18 లక్షలతో మూడు నెలల క్రితం అధికారులు టెండర్లు పిలిచారు. అయితే ఎవరూ టెండర్లుకు ముందుకు రాలేదు. దీంతో షట్టర్లు బాగుపడక లక్షల కూసెక్కుల నీరు వృథాగా పోతోంది.
ఖరీఫ్ ముగిసినా..నిర్విరామంగా ప్రవాహం
పొలాల్లోకి వస్తున్న నీటితో అపరాల
పంటలకు తీవ్ర నష్టం
నెల రోజులుగా పాత కుడి, ఎడమ కాలువల్లో వృథాగా ప్రవహిస్తున్న నీరు
ఎడమ కాలువ ద్వారా విడిచిపెడుతున్న నీరు 200 క్యూసెక్కులు
నెల రోజులుగా ఎడమ కాలువ ద్వారా
వృథాగా పోయిన నీరు 0.51 టీఎంసీలు
కుడి కాలువ ద్వారా విడిచిపెడుతున్న నీరు 60 క్యూసెక్కులు
తోటపల్లి ప్రాజెక్టు నీటి సామర్థ్యం 2.5 టీఎంసీలు
ఆదివారం నాటికి నిల్వ ఉన్న నీరు 2.1 టీఎంసీలు
వేసవికి ముందే తోటపల్లి ప్రాజెక్టులో తగ్గిపోయిన నీటి నిల్వలు


