నిధులు లేకుండా ముస్తాబులేమిటి?
గ్రామాలను ఎలా సుందరంగా తీర్చిదిద్దగలం
కలెక్టర్‌కు పంచాయతీ సర్పంచ్‌ల సూటి ప్రశ్న
చేతిలో చిల్లిగవ్వలేదని ఆవేదన
సాక్షి, పార్వతీపురం మన్యం: ‘ఉత్తి మాటలతో ఊరు శుభ్రమవుతుందా.. పారిశుద్ధ్య కార్మికుల జీతాలకే దిక్కులేదు.. నిధుల ఊసెత్తితే దాటవేస్తున్నారు.. ఖర్చు లేకుండా గ్రామాల్లో ‘ముస్తాబు’ అమలు చేయాలంటే ఎలా సాధ్యం?’ ఇదీ.. పలువురి సర్పంచ్‌ల ఆవేదన. పార్వతీపురంలోని ప్రైవేట్ కల్యాణ మండపంలో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సర్పంచ్‌ల సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి సర్పంచ్‌లకు దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలోనూ కుటుంబం ముస్తాబు కావాలన్నారు. ప్లాస్టిక్ రహిత గ్రామాలు, పల్లెలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సర్పంచులే గ్రామాల కు బాస్‌లని.. ఆ దిశగా తమ గ్రామాలను అభివృద్ధిపరచాలని ఆకాంక్షించారు. ముస్తాబుపేరిట గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుతూ, బహిరంగ మలమూత్ర విసర్జనకు కృషి చేయాలని కోరారు. కాలు వల శుభ్రత, చెత్తకుప్పలు లేకుండా గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఎలాంటి ఖర్చూ లేకుండా ఇలాంటి పనులు నిర్వహించవచ్చ ని చెప్పారు. దీనిపై సర్పంచ్‌లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు పారిశుద్ధ్య కార్మికులకు జీతాలిచ్చేందుకే పంచాయతీల్లో నిధులు లేవని చెప్పా రు. ఎన్నోసార్లు విన్నవించుకున్నా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన జరగడం లేదన్నారు. పలు సమస్యలపై సర్పంచ్‌లు చెప్పేందుకు ప్రయత్నించగా.. అధికారులు మధ్యలోనే బ్రేక్ వేశారు. దీంతో కలెక్టర్‌కు తమ పంచాయతీల్లో సమస్యలపై నామమాత్రంగానే సర్పంచ్‌లు వినతిపత్రాలిచ్చి సరిపెట్టుకున్నారు.
నిధులు నిల్.. నీతులు ఫుల్: సర్పంచుల ఆవేదన
జిల్లా యంత్రాంగం తీరుపై సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు నిల్.. నీతులు ఫుల్ మాదిరి అధికారుల తీరు ఉందని అసహనం వ్యక్తం చేశారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ముస్తాబు పేరిట హడావిడి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఉత్తి మాటలతో ఊరు శుభ్రపడదని పేర్కొన్నారు. నిధులు ఊసెత్తితే దాటవేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులెవరికీ బాధ్యత లేదని విమర్శించారు. గ్రామాల్లో మిల్లర్ల దోపిడీ, రైతుల ఇబ్బందులపైనా పలువురు నిలదీశారు. మంచినీరు, మౌలిక సదుపాయాల సమస్యలనూ ప్రస్తావించారు.


