గురుకులంలో ఆకలి కేకలు
భామిని: మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో విద్యార్థులు ఆదివారం మధ్యాహ్నం ఆకలితో అలమటించారు. రోజూ మధ్యాహ్నం 12.30 గంటలకే పెట్టాల్సిన భోజనాన్ని మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు విద్యార్థులకు పెట్టలేదు. దీంతో పలువురు విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడ్డారు. గురుకులంలో 460 మంది విద్యార్థులున్నారు.
భోజనం ఆలస్యం కావడంతో గదుల్లో, వరండాల్లో చేరి భోజనం కోసం పడిగాపులు కాశారు. గురుకులంలో సరైన పర్యవేక్షణ లేకే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా గురుకులంలో వంట ఏజెన్సీకి, నిర్వాహకులకు మధ్య వివాదం రేగుతోంది. దీంతో కావాలనే జాప్యం చేస్తూ విద్యార్థులను ఆకలికి గురి చేస్తున్నట్ట్టు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక విలేకరులు గురుకులానికి వెళ్లగా ప్రిన్సిపాల్ విజయనిర్మల అడ్డుకొని భోజన సమస్య పరిష్కరిస్తున్నట్టు సర్ది చెప్పారు. గ్యాస్ రెగ్యులేటర్ మరమ్మతులకు గురవడంతోనే భోజనంలో జాప్యం జరిగిందని పొంతన లేని సమాధానం ఇచ్చారు. చివరకు మధ్యాహ్నం 3.30 గంటల తరువాత విద్యార్థులకు భోజనం పెట్టారు.


