అడుగుకో గుంత.. రాకపోకలకు చింత
జియ్యమ్మవలస రూరల్: వంద రోజుల్లో వంద రోడ్లు వేస్తామన్న ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కనీసం రోడ్లపై ఏర్పడిన గోతులను పూడ్చే పనులు పూర్తిచేయడంలోనూ విఫలమయ్యా రని జియ్యమ్మవలస జెడ్పీటీసీ సభ్యురాలు మూడడ్ల శశికళ విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహిస్తున్న పల్లెపండగ కార్యక్రమం క్షేత్రస్థాయిలో నిధుల లేమితో వెక్కిరిస్తోందన్నారు. దీనికి పార్వతీపురం–గుణుపూర్ ప్రధాన రహదారి నుంచి దత్తివలస, పరజపాడు, లక్ష్మీపురం మీదుగా పిప్పల భద్ర వెళ్లే బీటీ రోడ్డే నిలువెత్తు నిదర్శనమన్నారు. అడుగుకో గుంతతో రాకపోకలకు ప్రయాణికు లు అవస్థలు పడుతున్నారన్నారు. నెలరోజు లుగా బస్సు రాకపోకలు నిలిచిపోయినా ఎమ్మెల్యేకు పట్టకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో స్థానికులు రూ. 32వేలు చందాలు వేసుకొని గోతులు పూడ్చుకునేందుకు సిద్ధమయ్యారన్నారు.
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సరిగ్గా జరగడం లేదని.. మిల్లర్లు అదనపు తూకంతో దోచుకుంటున్నారని సాలూరు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ధాన్యం సేకరణ లోపాలు, మిల్లర్ల అవకతవకలపై ఏఎంసీ చైర్మన్‌తోపాటు.. అధికార పార్టీకి చెందిన వారే ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలు ఎంత సక్రమంగా నడుస్తున్నాయో చెప్పడానికి సొంత పార్టీ వారు చేసిన విమర్శలే అద్దం పడుతున్నాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైస్ మిల్లర్లకు చేరిన ధాన్యాన్ని గ్రేడ్, తేమ, నాసిరకం పేరుతో రైతుల వద్ద క్వింటాకు 10 నుంచి 20 కిలోల వరకు అదనంగా దోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు. మిల్లుకు చేరిన వెంటనే తక్షణమే హమాలీ పేరుతో ప్రతి చిన్న బస్తాకూ రూ.5 నుంచి రూ.10 వసూలు చేస్తున్నారని తెలిపారు. కొనుగోలు కేంద్రం నుంచి మిల్లుకు ధాన్యం చేర్చిన క్రమంలో అద్దె కూడా రైతుల నుంచి వసూలు చేస్తున్నారని.. మిల్లర్లు సొంతంగా ఏర్పాటు చేసుకున్న వే బ్రిడ్జి తూకంలో చాలా వ్యత్యాసం ఉంటోందని పేర్కొన్నారు. ఫలితంగా వరి పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.
అలిగితే నష్టపోయేది మనమే..
● పార్టీ శ్రేణులకు లోకేశ్ సూచన
సాక్షి, పార్వతీపురం మన్యం: టీడీపీలో వ్యక్తులు శాశ్వతం కాదు, పార్టీ శాశ్వతమని పార్టీ జాతీ య ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. భామినిలో పార్టీ శ్రేణులనుద్దేశించి ఆయన గురువారం మాట్లాడారు. అలిగి ఇంట్లో పడుకుంటే నష్టపోయేది మనమేనని, గ్రూపు రాజకీయాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని సూచించారు. ప్రతి పనికి లోకేశ్, ఎమ్మెల్యే ఫోన్ చేయాలంటే కుదరదు. ఈ విషయంలో ఇన్చార్జి మంత్రి అచ్చెన్న కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలివ్వాలి అంటూ లోకేశ్ చెప్పడం గమనార్హం.


