ప్రగల్భాలు పలికారు.. డోలీ మోతలే మిగిల్చారు
గిరిజన ప్రాంతాల్లో డోలీల మోత లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికారు. వంద రోజుల్లో వంద రహదారులంటూ హడావిడి చేశారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేసిన గిరిశిఖర సిరివర రహదారి ఏడాది దాటినా నేటికీ పూర్తి కాలేదు. ఇప్పటికీ వైఎస్సార్‌సీపీ హయాంలో వేసిన రహదారులే దర్శనమిస్తున్నాయి. జిల్లాలో డోలీ మోతలు ఉండకూడదని పల్లె పండగ, అడవితల్లిబాట, డోలీ రహదారులు పేరిట ఉపాధి హామీ నిధులు మంజూరు చేశామని ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా 15 మండలాల్లో 71 రహదారి పనులకు పంచాయతీరాజ్ శాఖ ఉపాధి నిధులు దాదాపు రూ.52 కోట్ల మేర మంజూరు చేస్తే.. అందులో 11 మాత్రమే పూర్తయ్యాయి. అడవితల్లి పేరుతో మూడు రోడ్లు మంజూరు కాగా.. అవి బాలారిష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఈ పనులకు నిధుల సమస్య వెంటాడుతోంది. డోలీ మోతలను తప్పించేందుకు గుమ్మలక్ష్మీపురం, సాలూరుల్లో గిరిజన గర్భిణుల వసతిగృహాలను గతంలో ప్రారంభించారు. ఇక్కడ సేవలందించే సిబ్బందిని తొలగిస్తూ.. వసతిగృహాలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోంది.


