సభలు, సమావేశాలపై ప్రత్యేక దృష్టి : కలెక్టర్
పార్వతీపురం రూరల్: జిల్లా పరిధిలో ఇకపై జరిగే ఏ కార్యక్రమాలైనా భద్రతకు సంబంధించిన ఏర్పాట్లపై పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అపశ్రుతులకు, జన నష్టానికి తావివ్వకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా సమర్ధవంతమైన ఏర్పాట్లు ఉండాలని తేల్చి చెప్పారు. జన సమూహం అధికంగా ఉన్న చోట సమర్ధవంతమైన క్యూలైన్స్ నిర్వహణ, పటిష్టమైన నియంత్రణకు ప్రత్యేక శిక్షణ పొందిన పోలీసు బలగాలను తగిన సంఖ్యలో నియమించాలన్నారు. రాకపోకలకు వీలుగా ప్రవేశ, నిష్క్రమన మార్గాలను స్పష్టంగా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేస్తూ భద్రతా ఏర్పాట్లపై పోలీసు, రెవెన్యూ, దేవదాయ, అగ్నిమాపక, వైద్య, ఆరోగ్య శాఖల నిరంతరం సమన్వయంతో పని చేయాలని, అత్యవసర ప్రతిస్పందనకు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఏఎస్పీగా మనీషా వంగలరెడ్డి
పార్వతీపురం రూరల్: పార్వతీపురం సబ్ డివిజన్ ఏఎస్పీగా మనీషా వంగలరెడ్డి నియమితులయ్యారు. ఇక్కడ ఏఎస్పీగా పని చేసిన అంకిత సురాన గత నెల 30న సత్యసాయి జిల్లాకు అదనపు ఎస్పీగా పదోన్నతిపై బదిలీ అయిన సంగతి విదితమే. అయితే ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా, ఇప్పటివరకు గ్రేహౌండ్స్‌లో అసాల్ట్ కమాండర్‌గా సేవలందించిన, నంద్యాలకు చెందిన మనీషా వంగలరెడ్డిని పార్వతీపురం ఏఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
నేడు పీజీఆర్‌ఎస్
సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) సోమవారం నిర్వహించనున్నారు. పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాధ్ వినతులు స్వీకరించనున్నట్టు ఐటీడీఏ వర్గాలు తెలిపాయి. గిరిజనులు తమ సమస్యలు వినతులు రూపంలో ఇవ్వవచ్చు.
నేడు కలెక్టరేట్ వద్ద ధర్నా
పార్వతీపురం రూరల్: అన్నదాత సుఖీభవ రూ.20 వేలు వెంటనే కౌలు రైతులకు జమ చేయాలని, కొత్త కౌలు చట్టం తీసుకురావాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద సోమవారం నిర్వహించనున్న ధర్నాకు జిల్లా రైతులు, కౌలు రైతులందరూ కదలి రావాలని ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి రమణామూర్తి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
విజయనగరం అర్బన్: కార్తీక సోమవారం సందర్భంగా ఈ నెల 3వ తేదీన జిల్లా వ్యాప్తంగా దేవాలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి ఆదేశించారు. దేవాలయాల వద్ద తగు భద్రతా, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్య చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు, దేవస్థాన నిర్వాహకులకు సూచనలు జారీ చేశారు. భక్తులు క్రమశిక్షణతో, శాంతియుతంగా దర్శనాలు ముగించుకోవాలని కలెక్టర్ కోరారు.


