వైఎస్సార్‌సీపీ కొవ్వొత్తుల ర్యాలీ
● దేవాలయాలలో భక్తులకు రక్షణ కరువైంది
● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్
పాలకొండ : రాష్ట్రంలో ప్రజలతో పాటు భక్తులకు కూడా భద్రత కరువైందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గలో ఏకాదశి సందర్భంగా శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగిన ఘటనలో మృతి చెందిన భక్తులకు ఆదివారం సాయంత్రం పాలకొండ ప్రధాన రహదారిలో నివాళులు అర్పిస్తూ కొవొత్తులతో శాంతి ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాలయాలలో భక్తులకు రక్షణ లేక చనిపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నా.. కూటమి ప్రభుత్వానికి చలనం లేదని విమర్శించారు. దేవాలయాలలో పర్వదినాల సందర్భంగా రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతుందన్నారు. రానున్న రోజులలో ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందోనని పేర్కొన్నారు. కాశీబుగ్గలో తొక్కిసలాట జరిగిన ఆలయం ప్రైవేటుదని తమకు సంబంధం లేదని ప్రభుత్వం చెబుతున్నదంటే, దీనార్ధం ప్రభుత్వానిదే తప్పని తెలుస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని ఘోరాలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కనపాక సూర్యప్రకాశరావు, వెలమల మన్మధరావు, పాలవలస ధవళేశ్వరరావు, దుప్పాడ పాపినాయుడు, తూముల లక్ష్మణరావు, పల్లా భానుబాబు, దుంపల చిన్ని, కె.విజయకుమార్, కాంతారావు తదితరులు పాల్గొన్నారు.


