33శాతం నిబంధనే గుదిబండ
పంట నష్ట పరిహారం చెల్లింపుపై వ్యవసాయ శాఖ నిబంధనలే రైతులకు పెను శాపంగా మారుతున్నాయి. అధికారులు క్షేత్ర స్థాయిలో జాబితాలను సిద్ధం చేస్తున్నప్పటికీ రైతుకు ఉన్న మొత్తం పంటలో 33శాతం దెబ్బతింటేనే పరిహారం అందుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పంట దిగుబడిని అనుసరించి ఈ సాయం లెక్కేస్తామని కూడా చెబుతున్నారు. సరిగ్గా పంట చేతికి వచ్చే సమయానికి తుఫాన్ నష్టం తెచ్చిపెట్టడంతో రైతులు తీవ్ర నష్టాన్ని భరిస్తూ యంత్రాలతో కోతలు కోసి వ్యాపారులకు విక్రయించుకుంటున్నారు. కాస్తాకూస్తో పరిహారం వస్తుందన్న ఆశతో మిగిలిన రైతులు ఎదురు చూస్తున్నారు. కానీ ఈ 33శాతం నిబంధనల మెలికతో క్షేత్ర స్థాయిలో నష్టం కళ్ల ఎదుటే కనిపిస్తున్నా తమకు పరిహారం వర్తిస్తుందన్న నమ్మకం లేకుండా పోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ కఠిన నిబంధనను పక్కన పెట్టి నష్టపోయిన ప్రతీ ఒక్కరిని పరిహారం చెల్లించే దిశగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


