రామతీర్థంలో వైభవంగా తెప్పోత్సవం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో స్వామివారి తెప్పోత్సవం ఆదివారం కనుల పండువగా జరిగింది. క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి తెప్పోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామి సన్నిధిలో నిత్య కల్యాణ మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవమూర్తులను మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ భాష్కర పుష్కరిణి ప్రధాన ఘాట్ వద్దకు తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంపై ఆశీనులు చేశారు. అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం చేపట్టి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి హారతి సమర్పించారు. ప్రత్యేక పూజల అనంతరం పూసపాటిరేగ మండలంలో కోనాడ నుంచి తీసుకువచ్చిన పడవలో స్వామిని ఉంచి పు ష్కరిణిలో తెప్పోత్సవాన్ని జరిపించారు. అర్చకుల వేద మంత్రాలతో, భక్తుల జయజయ ధ్వానాల నడుమ రామచంద్రస్వామి పుష్కరిణిలో ఊరేగారు. ఎస్సై గణేష్ ఆధ్వర్యంలో పో లీసులు బందోబస్తు నిర్వహించారు.


