రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి
● దెబ్బతిన్న పంటలు కొనుగోలు చేయాలి
● మాజీ డిప్యూటీ సీఎం రాజన్నదొర
సాలూరు రూరల్: మోంథా తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు కనీస బీమా సౌకర్యం కల్పించలేని ప్రభుత్వం అసలు రైతుల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తుందో కూటమి నాయకులు సమాధానం చెప్పాలని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. మండలంలోని పెదపదం పంచాయతీలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రైతులు నష్టపోయిన పంట పొలాలను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరిలో సంపత్, ఆర్‌జేఎల్, సోనామసూరు, సాంబమసూరు రకాల పంటలు బాగా దెబ్బతిన్నాయన్నారు. తుఫాన్ ప్రభావంతో నీట మునిగిన నేలకొరిగిన వరి చేలు చూస్తుంటే రైతు కష్టం, కన్నీళ్లు కనిపిస్తున్నాయన్నారు. ప్రభుత్వం పంటలు నష్టపోయిన రైతులకు నష్ట పరిహరంతో పాటు పంటలను కొనుగోలు చేయాలని డిమండ్ చేశారు.
ఉచిత బీమా లేక రైతుల ఆందోళన
గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు తమ పంటల బీమాను ప్రభుత్వమే చెల్లించి ఆదుకుందన్నారు. గతంలో తుఫాన్ కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు బీమా డబ్బులు అందేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. గత సంత్సరం కూడా ఇలాగే పంటలు నష్టపోయిన రైతులకు ఎలాంటి నష్టపరిహరం అందలేదని, ఇప్పుడు కూడా బీమా సొమ్ము ప్రభుత్వం చెల్లించకపోవడంతో రైతులు బీమాకు దూరమయ్యారన్నారు. మండలంలోని రెండు తుఫాన్‌లకు అరటి, మొక్కజొన్న, వరి, పత్తి పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహరం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
