
పురుగు మందు తాగి యువతి మృతి
సీతానగరం: మండలంలోని పెదభోగిలి–1 సచివాలయంలో ఎంఎల్‌హెచ్‌పీ గా ఉద్యోగం చేస్తున్న చింతాడ సంధ్య(25 ) విశాఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. పెదంకలాం గ్రామానికి చెందిన చింతాడ సంధ్య ఎంఎల్‌ఎచ్‌పీగా విధులు నిర్వహిస్తోంది. సంధ్యకు వివాహం చేయాలన్న సంకల్పంతో వివాహానికి సంబంధించిన చర్చలు ఇంట్లో రావడంతో తాను పెళ్లిచేసు కోనని ఆమె నిరాకరించగా కుటుంబంలో వచ్చిన మనస్పర్థలతో మనస్తాపం చెంది సంధ్య అక్టోబరు 7వ తేదీన సీతానగరం రైల్వే గేటువద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆమెను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యసేవల నిమిత్తం విశాఖపట్నంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందింది. మృతురాలి తల్లి చింతాడ మరియమ్మ(మీరమ్మ) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.రాజేష్ తెలియజేశారు.