
డీఎస్‌డీఓగా వెంకటేశ్వరరావు
● శ్రీధర్‌రావుకు పార్వతీపురం మన్యం జిల్లాకు బదిలీ
విజయనగరం: జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి (డీఎస్‌డీఓ)గా ఎస్.వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. విశాఖ జిల్లా అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆయనను విజయనగరం జిల్లాకు బదిలీ చేస్తూ శాప్ ఎం.డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు జిల్లాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన కె.శ్రీధర్‌రావును పార్వతీపురం మన్యం జిల్లాకు చేస్తూ బదిలీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా విజయనగరం జిల్లా హాకీ కోచ్‌గా విధులు నిర్వహిస్తున్న ఎ.మహేష్‌బాబుకు శ్రీకాకుళం జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. తాజా బదిలీ ఉత్తర్వుల మేరకు సంబంధిత అధికారులు వెనువెంటనే బాధ్యతలు స్వీకరించాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారిగా నియామకమైన వెంకటేశ్వరరావుకు గతంలో జిల్లాలో పని చేసిన అనుభవం ఉంది.
ఇసుక అక్రమ తరలింపు అడ్డగింత
బొబ్బిలి రూరల్: మండలంలోని అలజంగి గ్రామం వద్ద వేగావతి నదిలో అక్రమంగా ఇసుకను తవ్వి తరలించేందుకు సిద్ధం చేసిన ట్రాక్టర్లను తహసీల్దార్ ఎం.శ్రీను శనివారం పట్టుకున్నారు. రెవెన్యూ, పోలీసులతో కలిసి ట్రాక్టర్లను తహసీల్దార్ కార్యాలయం వద్దకు తరలించారు. శని,ఆదివారాలు సెలవు దినాలు కావడంతో అధికారులెవరూ విధుల్లో ఉండరని భావించిన ట్రాక్టర్ యజమానులు శనివారం ఉదయం ఆరు గంటలకే ఇసుక తవ్వకాలకు జేసీబీనీ సిద్ధం చేసుకుని వరుస క్రమంలో జేసీబీతో నదిలో ఇసుకను తోడుతున్నారు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు తహసీల్దార్ రెవెన్యూ, పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేయడంతో దాడిచేసే సమయానికి జేసీబీ, కొన్ని ట్రాక్టర్లు తప్పించుకోగా ఇసుకను లోడు చేసేందుకు సిధ్దంగా ఉన్న ఏడు ఖాళీ ట్రాక్టర్లను తహసీల్దార్ అదుపులోకి తీసుకున్నారు. యజమానులను పిలిపించి హెచ్చరించారు. ట్రాక్టర్ల నంబర్లు తీసుకుని అక్రమ ఇసుక రవాణాతో దొరికితే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించి విడిచిపెట్టారు. ట్రాక్టర్ యజమానుల సంఘం ప్రతినిధులతో మాట్లాడుతూ ఇది చివరి అవకాశమని మరో మారు దొరికితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సంతకవిటి: మండలంలోని సిరిపురం గ్రామానికి చెందిన గొర్లె దమయంతి (50) పాముకాటుకు గురై మృతిచెందింది. దీనిపై ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 10న దమయంతి తన పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లింది. ఆమె నీరు పెడుతున్న సమయంలో గుర్తుతెలియని పాము కాటు వేసింది. ఈ విషయాన్ని గ్రామంలో ఉన్న భర్త తారకేశ్వరరావుకు ఫోన్‌లో తెలియజేయగా వెంటనే స్థానికులు డోల రామారావు, చిత్తిరి సూర్యనారాయణలను తీసుకుని పొలానికి వస్తున్న భర్తకు ఎదురుగా వచ్చిన దమయంతి పాము కాటువేసిన గాయాన్ని చూపి స్పృహకోల్పోయింది. హుటాహుటిన అప్రమత్తమైన భర్తతోపాటు గ్రామస్తులు పొందూరు ప్రభుత్వ ఆస్పత్రికి ఆమెను తరలించి ప్రథమ చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు వైద్యులు రిఫర్ చేశారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు వెల్లడించారు. మృతురాలి భర్త తారకేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్సై వెల్లడించారు.
రేగిడి: మండల పరిధిలో ని రెడ్డిపేట గ్రామానికి చెందిన కొబగాన నా యుడు (45) శనివారం పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు, స్థానికులు అందించిన వివరాల ప్రకారం నాయుడు ఆటో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తూ తనకున్న కొద్దిపాటి పొలంలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలాగానే జొన్న పిక్కలను సాయంత్రం 4 గంటల సమయంలో తన పొలంలోనే శ్మశానవాటిక వద్ద ఆరబెడుతున్నాడు. అదే సమయంలో ఒక్కసారిగా పెద్ద ఉరుము ఉరమడంతో దగ్గర్లోనే పిడుగుపడి సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. దగ్గర ప్రాంతంలో ఉన్న రైతులు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. దీంతో వారంతా వచ్చి భోరున విలపించారు. మృతుడికి భార్య సుగుణ, ఇద్దరు కుమార్తెలు ఉండగా పెద్ద కుమార్తె రాధికకు వివాహం చేశారు. లాకిని అనే రెండో అమ్మాయి డిగ్రీ చదువుతోంది. భార్య సుగుణ, తల్లిదండ్రులు రామినాయుడు, జయమ్మలు నాయుడు మృతితో భోరున విలపించారు. ఈ సమాచారం తెలుసుకున్న వీఆర్వో కె.ఈశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి గోపాలనాయుడు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై బాలకృష్ణ సిబ్బందితో కలిసి వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని రాజాం ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

డీఎస్‌డీఓగా వెంకటేశ్వరరావు

డీఎస్‌డీఓగా వెంకటేశ్వరరావు