
వైద్యవిద్యా వ్యవస్థ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి
● ఆరోగ్యశ్రీ బకాయిలు వెంటనే చెల్లించాలి
● పౌరవేదిక సంఘం డిమాండ్
విజయనగరం గంటస్తంభం: పేదలకు అందుబాటులో వైద్యవిద్య అందాలంటే వైద్యవిద్య. ప్రజారోగ్య వ్యవస్థ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం స్థానిక ఎల్బీజీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైద్యరంగాన్ని పీపీపీ మోడల్‌లో ప్రైవేట్ చేతుల్లోకి అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. ఇది ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నమన్నారు. గత ప్రభుత్వం కేంద్ర నిధులతో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయగా, అందులో ఐదు ఇప్పటికే ప్రారంభమైనట్లు గుర్తుచేశారు. ఇప్పుడు ఆ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనుకోవడం పేద విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే వైద్యవిద్య పేదలకు అందని ద్రాక్ష అవుతుంది. ఫీజులు భారీగా పెరిగి పేద విద్యార్థులు వెనుకబడిపోతారు. అదేవిధంగా వైద్యం కూడా మరింత ఖరీదుగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పీహెచ్‌సీ వైద్యుల సమస్యలు పరిష్కరించాలి
ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేట్ ఆస్పత్రులకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం వల్ల పేదలు చికిత్స అందక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. వెంటనే ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీ వైద్యులు తమ సమస్యల పరిష్కారం కోసం 20 రోజులుగా సమ్మెలో ఉన్నారని, వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజారోగ్య వ్యవస్థ నిర్వీర్యమవుతోందని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని కోరారు. ఈనెల 15తేదీన విజయనగరంలో జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో యూఎస్.రవికుమార్, సుధీర్, సతీష్ పాల్గొన్నారు.