
కన్నకొడుకే..కాలయముడు
● మద్యం మత్తులో తండ్రిని రాయితో కొట్టిన కుమారుడు
● ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
చెందిన తండ్రి
తెర్లాం: కనిపెంచిన కుమారుడే కన్న తండ్రి పట్ల కాలయముడయ్యాడు. మద్యం తాగిన మైకంలో కుమారుడు రాయితో కొట్టడంతో తండ్రి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చెందిన సంఘటన తెర్లాం మండలం ఎం.ఆర్ అగ్రహారం గ్రామంలో సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావు గురువారం తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఎంఆర్ అగ్రహారం గ్రామానికి చెందిన నగరపు అప్పలస్వామి(85)కి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిద్దరికి తన భూమిని పంచిపెట్టి, తన పోషణ నిమిత్తం ఒక ఎకరా భూమిని అప్పలస్వామి ఉంచుకున్నాడు. వృద్ధాప్యంలో ఉన్న అప్పలస్వామిని పెద్దకుమారుడు తన వద్ద ఉంచుకుని తండ్రిని పోషిస్తున్నాడు. తన వద్ద ఉన్న ఎకరా భూమి సాగు చేసుకునేందుకు పెద్ద కుమారుడికి తండ్రి ఇచ్చాడు. తండ్రి వద్ద ఉన్న భూమి తనకు సాగు చేసుకునేందుకు ఇవ్వాలని చిన్న కుమారుడు శంకరరావు అడగ్గా తండ్రీకొడుకుల మాటామాట పెరిగి గొడవకు దారితీసింది. దీంతో శంకరరావు రాయి తీసుకుని తండ్రి తలపై బలంగా కొట్టగా తీవ్రంగా గాయపడిన అప్పలస్వామిని తెర్లాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి నిమిత్తం మనుమరాలు నగరపు కల్పన, ఇతర కుటుంబసభ్యులు తీసుకువచ్చారు. ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం తలకు స్కానింగ్ చేయించి తీసుకురమ్మని వైద్యులు చెప్పడంతో స్కానింగ్ తీయించి తీసుకువచ్చారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం అప్పలస్వామి మృతి చెందాడు.
పరిశీలించిన సీఐ
ఈ సంఘటనకు సంబంధించి అందిన సమాచారంతో ఎస్సై సాగర్‌బాబు, బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావు క్లూస్ టీమ్‌తో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి వివరాలు సేకరించారు. అప్పలస్వామి మృతదేహానికి కుటుంబసభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. మృతుడి మనుమరాలు కల్పన ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెర్లాం ఎస్సై సాగర్‌బాబు హత్య కేసు నమోదు చేయగా, బొబ్బిలి రూరల్ సీఐ దర్యాప్తు చేస్తున్నారు.

కన్నకొడుకే..కాలయముడు

కన్నకొడుకే..కాలయముడు