
కబడ్డీ పోటీల్లో డిగ్రీ విద్యార్థినుల ప్రతిభ
చీపురుపల్లి: జోనల్‌స్థాయి బాలికల కబడ్డీ పోటీల్లో స్థానిక ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాల బాలికలు ఉత్తమ ప్రతిభ కనపరిచారు. విశాఖపట్నంలోని మహిళా డిగ్రీ కళాశాల 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కడ జోనల్ స్థాయి బాలికల కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న చీపురుపల్లి ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాల బాలికల జుట్టు తృతీయస్థానంలో నిలిచింది. దీంతో కళాశాల ప్రిన్సిపాల్ డా.పీవీజీ.కృష్ణాజీ, వైస్ ప్రిన్సిపాల్ ఎం.రమేష్ కుమార్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ కె.జ్వాలాముఖి, పీఈటీ పి.రామలక్ష్మి తదితరులు విద్యార్థినులను అభినందించారు.
కుక్కలు కరిచి ఆరుగురికి గాయాలు
మెంటాడ: మండల కేంద్రంలో గురువారం ఆరుగురిని కుక్కలు కరవడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ మేరకు గాయాలపాలైన వారిని కుటుంబ సభ్యులు వైద్యసేవల కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితులకు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం తీవ్రగాయాలైన కె.అప్పలనాయుడు, పి.శంకరరావులను గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు డాక్టర్ లోకప్రియ తెలిపారు.
దుండగుల దుశ్చర్య
నెల్లిమర్ల: మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పుట్టినరోజు సందర్భంగా స్థానిక నగరపంచాయతీలో వైఎస్సార్ సీపీ నాయకులు, ఆయన అభిమానులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పలుచోట్ల ఏర్పాటు చేసిన ఆయన బర్త్‌డే ఫ్లెక్సీలను గుర్తు తెలియని దుండగులు చించివేశారు. స్టేట్‌బ్యాంకు, రామతీర్థం జంక్షన్‌ల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పూర్తిగా తొలగించగా, పోలీస్‌స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన మరో ఫ్లెక్సీని చించివేశారు. దీనిపై వైఎస్సార్‌సీపీ శ్రేణులు, స్థానికులు మండిపడుతున్నారు. ఇదేం పని? ఇది మంచి పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలను రాజకీయ నాయకులెవరూ ప్రోత్సహించకూడదని హితవు పలుకుతున్నారు.

కబడ్డీ పోటీల్లో డిగ్రీ విద్యార్థినుల ప్రతిభ