
జూట్ మిల్లు భూముల కోసం కూటమి నాయకుల కుట్ర
● భూములు డొంకినవలస రైతులకే చెందాలి
● మాజీ ఎమ్మెల్యే శంబంగి
బొబ్బిలి: భూములిచ్చిన ప్రతి రైతుకు జూట్‌మిల్లులో ఉద్యోగం ఇస్తామని, బాడంగి మండలం డొంకినవలస ఎత్తు కానా వద్ద 80వ దశకంలో రైతుల వద్ద సేకరించిన సుమారు 32 ఎకరాల భూములు ఆ ఫ్యాక్టరీ నిర్మించనందున తిరిగి రైతులకే చెందాలని మాజీఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాడంగి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాట్లాడారు. మహావీర్ కంపెనీ ప్రతినిధులు సేకరించిన భూములకు సంబంధించి డమ్మీ నాయకులు తయారై మ్యుటేషన్‌కు సిద్ధమవుతున్నారని, దీనిని ఖండిస్తున్నానన్నారు.
ఇన్‌చార్జ్ తహసీల్దార్‌తో మ్యుటేషన్‌కు ప్రయత్నాలు
గతంలో ఇక్కడున్న తహసీలా్‌ద్‌ర్ సుధాకర్ అటువంటి పనులకు ఒప్పుకోరని ట్రాన్స్‌ఫర్ చేయించి ఆయన స్థానంలో పక్క మండలంలో పనిచేస్తున్న ఓ డీటీకి ఎఫ్‌ఏసీ ఇచ్చి నియమించుకున్నారని, ఇప్పుడా ఇన్‌చార్జి తహసీల్దార్‌తో మ్యుటేషన్‌కు ఆమోదం చెప్పేందుకు కూటమి నాయకులు కొత్త ఎత్తుగడ వేశారని ఆరోపించారు. ఆ భూములు ఎలాగైనా హస్తగతం చేసుకునేందుకు మండల స్థాయి నుంచి కలెక్టర్ వరకూ నగదు కూడా చేతులు మారినట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయమై తాను రెండు రోజుల క్రితం ఆర్డీఓ రామమోహనరావు, కొత్తగా వచ్చిన తహసీల్దార్‌కు ఫోన్ చేసి ఆ భూములు అక్కడ ఉన్న రైతులకు చెందాలని చెప్పానన్నారు. కూటమి నాయకులు, ఇతర వ్యక్తులు ఆ భూములను హస్తగతం చేసుకుంటామంటే ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. దీనిపై ఎందాకై నా వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. సమావేశంలో నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు బేతనపల్లి శంకరరావు, కార్యదర్శి తెర్లి శ్రీనివాసరావు, గూడెపువలస రాజు, శంకరరావు తదితరులు పాల్గొన్నారు.