
సిరిమాను చెట్టుకు పూజలు
● 24న సిరిమాను చెట్టు తరలింపు
● అసిస్టెంట్ కమిషనర్ శీరిష
గంట్యాడ: మండలంలోని కొండతామరాపల్లి గ్రామానికి చెందిన చల్ల అప్పలనాయుడు, లోకవరపు సత్యం కల్లాల్లో సాక్షాత్కరించిన పైడితల్లి సిరిమాను, ఇరుసుమాను చెట్లకు ఆలయ అర్చకులు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. పైడితల్లి ఆలయ ఇన్‌చార్జి ఈఓ కె.శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, అర్చకులు చెట్టుకు పసుపు, కుంకుమలతో ముహూర్తం ప్రకారం బొట్టుపెట్టారు. అనంతరం గ్రామస్తులు పూజలు చేశారు. ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ ఈ నెల 24న చెట్టును విజయనగరంలోని హుకుంపేటకు తరలిస్తామని తెలిపారు. అక్టోబర్ 6,7 తేదీల్లో నిర్వహించే అమ్మవారి సిరిమానోత్సవానికి సంబంధించి ఈ నెల 12వ తేదీన పందిరాట వేశామన్నారు. 24వ తేదీ ఉదయం 8:30 గంటలకు చెట్టుతీసే కార్యక్రమం చేపడతామన్నారు. ఆ రోజున ఇక్కడకు వచ్చే భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ గాదె శ్రీనువాసులునాయుడు, సర్పంచ్ కోడెల ముత్యాలనాయుడు, తహసీల్దార్ నీలకంటేశ్వర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.