
రామతీర్థంలో ప్రారంభమైన పవిత్రోత్సవాలు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామివారి దేవస్థానంలో పవిత్రోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా ఆలయంలో భాద్రపద బహుళ దశమి నుంచి త్రయోదశి వరకు పవిత్రోత్సవాలను వైఖాసన ఆగమ శాస్త్రోక్తంగా జరిపించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో పవిత్రోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. వేకువజామున ప్రాతఃకాలార్చన, బాలభోగం, యాగశాలలో సుందరకాండ హవనం, తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయంలోని వెండి మండపం వద్ద స్వామికల్యాణాన్ని వైభవంగా జరిపించారు. సాయంత్రం 6 గంటలకు విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం పూజలు చేశారు.