
వట్టిగెడ్డ మిగులు జలాలు విడుదల
జియ్యమ్మవలస రూరల్: మండలంలోని ప్రధాన సాగునీటి వనరైన వట్టిగెడ్డ ప్రాజెక్టు నుంచి మంగవారం ఒక గేటు ద్వారా 300 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదలచేసినట్టు ఏఈఈ బి.శంకరరావు తెలిపారు. ప్రాజెక్టు సామర్థ్యం 399 అడుగులు కాగా, ఇప్పటికే 398 అడుగుల నీటి మట్టం ఉందని ఆయన తెలిపారు. ఈ ఏడాది రైతులకు అవసరమైన సాగునీరు అందుతుందన్నారు.
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు
గరుగుబిల్లి: రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి సిబ్బందిని ఆదేశించారు. గరుగుబిల్లి మండలం పెద్దూరు గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని, గరుగుబిల్లి గ్రామాల్లోని పంట పొలాలను మంగళవారం పరిశీలించారు. ఈ–క్రాప్ నమోదు ప్రక్రియపై ఆరా తీశారు. ఈ–క్రాప్‌లో పంటల నమోదువల్ల పంటల బీమా వర్తిస్తుందన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే నోటీసులు జారీచేసి చర్యలు చేపట్టాలని తహసీల్దార్ బాలను ఆదేశించారు. కార్యక్రమంలో వీఆర్వో కరుణాకర్, కార్యదర్శి బి.అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.
కనీస వేతనం చెల్లించండి
● రాష్ట్ర అధ్యక్షుడు బసవరాజు
విజయనగరం ఫోర్ట్: రాష్ట్ర వ్యాప్తంగా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ (102)లో పనిచేస్తున్న సిబ్బందికి కనీస వేతనం నెలకు రూ.26 వేలు చెల్లించాలని ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శలు బసవరాజు, దేవిప్రసాద్ డిమాండ్ చేశారు. విజయనగరంలోని యూనియన్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. పదేళ్లుగా పనిచేస్తున్నా కేవలం రూ.10వేలు వేతనం చెల్లించడం తగదన్నారు. సమావేశంలో యూనియన్ నాయకులు రమణ, పోలిరాజు, నాయుడు, గణేష్, తదితరులు పాల్గొన్నారు.
నేడు సిరిమాను చెట్టుకు పూజలు
గంట్యాడ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో భాగంగా గంట్యాడ మండలం కొండ తామరపల్లిలో సిరిమాను చెట్టును గుర్తించారు. దీనికి ముహూర్తం ప్రకారం బుధవారం ఉదయం 9.15 గంటలకు సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు బొట్టుపెట్టు కార్యకమం నిర్వహిస్తారు. చెట్టుకు ప్రత్యేక పూజలు చేస్తారు.
విజయనగరంలో
ఎన్‌ఐఏ సోదాలు
విజయనగరం క్రైమ్: ఉగ్రవాద భావజాలంతో అరెస్టయిన విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆబాద్‌వీధికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ(ఎన్‌ఐఏ) బృందం దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలోన్ని 16 చోట్ల మంగళవారం ఏకకాలంలో సోదాలు జరిపింది. అందులో భాగంగా విజయనగరం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విచారణ చేపట్టింది. సిరాజ్‌కు సంబంధించిన పలు అంశాలపై జిల్లా పోలీస్ అధికారులను ప్రశ్నించింది. ఈ ఏడాది మే నెలలో ఎన్‌ఐఏ బృందం నగరంలోని ఆబాద్ వీధికి చెందిన సిరాజ్‌ను అదపులో తీసుకోవడం, ఆ తర్వాత స్థానిక పోలీసులు వారం రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారణ జరిపిన తర్వాత కోర్టులో హాజరుపర్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్‌లో ఉంటున్న ఉగ్రవాది సిరాజ్ నుంచి ఎన్‌ఐఏ అధికారులు ఇప్పటికే వివరాలు రాబట్టారు.

వట్టిగెడ్డ మిగులు జలాలు విడుదల

వట్టిగెడ్డ మిగులు జలాలు విడుదల