
ఎవరి దారి వారిదే..!
మౌలిక వసతులు అంతంతమాత్రమే...
ఐటీడీఏ..
సీతంపేట: జిల్లా కలెక్టరేట్ తర్వాత రెండో కలెక్టరేట్ ఐటీడీఏ అనే నానుడి ఉంది. అలాంటి ఐటీడీఏకు ఏడాదిన్నరగా పూర్తి స్థాయిలో పీవోను నియమించకుండా కూటమి సర్కార్ దోబూచులాడుతుంది. ఇన్‌చార్జ్ పీవోలతో నెట్టుకొస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేకంగా ఐటీడీఏకు పీవోలను శాశ్వతంగా నియమించింది. ఇన్‌చార్జ్‌లతో నడిపించిన దాఖలాలు లేవు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 20 సబ్‌ప్లాన్ మండలాలు ఉన్నాయి. 1250 వరకు గిరిజన గ్రామాలున్నాయి. శ్రీకాకుళం జిల్లా పరిధిలో 16, పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో 4 మండలాలు ఉన్నాయి. 2లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు. 13కు పైగా ప్రభుత్వ శాఖలు పని చేస్తున్నాయి. ఇంజినీరింగ్, గిరిజన సంక్షేమ శాఖ, వైద్య శాఖ, ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ, గిరిజన సహకార సంస్థ వంటివి నిర్వహించబడుతున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నప్పటకీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక జనరల్ బాడీ సమావేశం కూడా నిర్వహించలేదు. దీంతో ఏ శాఖ దారి వారిదే అన్నట్టు ఉంది. పాలకవర్గ సమావేశాలు ద్వారా గిరిజనులకు ఏఏ పథకాలు అవసరం, ఉన్న పథకాలు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయని, క్షేత్ర స్థాయిలో పథకాల పని తీరు మంత్రులు, ఎమ్మెల్యేలు చర్చించడానికి వీలుంటుంది. గవర్నింగ్ బాడీ సమావేశం కూడా ఇంతవరకు నిర్వహించకపోవడం గమనార్హం.
గిరిజన విద్యా సంస్థల్లో హెల్త్ వలంటీర్లు లేరు..
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్ వలంటీర్లు లేరు. ఐటీడీఏ పరిధిలో 60 గిరిజన సంక్షేమ వసతిగృహాల్లో సుమారు 12 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యాలను పరిరక్షించే ఏఎన్‌ఎంలు లేరు. అత్యవసర సమయాల్లో జ్వరం, ఇతర వ్యాధులు వస్తే విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. కనీసం ప్రాధమిక చికిత్స చేసే వారు లేకపోవడంతో దీనావస్థలో ఉన్నారు. ఏడాదిన్నర కిందట ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంలను నియమిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి హామీ ఇచ్చినా ఇంతవరకు నెరవేర్చలేదు. కాగా పాఠశాలలు పర్యవేక్షించే ఏటీడబ్ల్యూవో పోస్టులు కూడా రెండు ఖాళీగా ఉన్నాయి. వీటిని ఇన్‌చార్జ్‌లతోనే నెట్టుకువస్తున్నారు. విద్యార్థులకు వండి వడ్డించే వంట సిబ్బంది కొరత కూడా ఉంది.
పడకేసిన ఉద్యానవనాలు
ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖల ద్వారా రైతులకు మేలు చేసే యంత్ర సామగ్రి గతంలో పంపిణీ చేసేవారు. ఇప్పుడు సబ్సిడీపై ఎటువంటి పంపిణీ లేదు. పవర్ టిల్లర్లు, మినీ ట్రాక్టర్లు, పవర్‌వీడర్లు, స్ప్రేయర్లు తదితర పరికరాలు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. కేవలం మారిషస్ ఫైనాపిల్ సక్కర్లు మాత్రమే పంపిణీ చేసి ఉద్యానవన శాఖ చేతులు దులుపుకుంది. కాగా మరో ముఖ్యమైన గిరిజన సహకార సంస్థ అటవీ ఉత్పత్తులు నామమాత్రంగానే కొనుగోలు చేస్తుంది. కొండచీపుర్లు, ఇతర అటవీ ఉత్పత్తులకు సరైన మద్దతు ధరలు లేకపోవడంతో గిరిజనుల ఇళ్ల వద్దే అటవీ ఉత్పత్తులు విక్రయించకుండా ఉండిపోతున్నాయి. వెలుగు ద్వారా నిర్వహిస్తున్న వీడీవీకేలు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయి. 54కు పైగా వీడీవీకేలకుగాను మూడు, నాలుగు తప్ప ఎక్కడా నిర్వహించడం లేదు. జీడి, కొండచీపుర్లు తయారీ, పసుపు, చింతపండు ప్రోసెసింగ్ చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసినా ఇవి మూలనపడ్డాయి.
గిరిజన ప్రాంతాల్లో పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది. ఐటీడీఏకు వచ్చి సమస్యలు చెప్పుకుంటే పరిష్కారం అవుతాయనేది లేదు. క్షేత్ర స్థాయిలో వివిధ శాఖల పథకాలు అమలు కాని పరిస్థితి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కొండపోడు పట్టాలతో పాటు, విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేశాం. ఇప్పుడు ఆ పరిస్థితి మచ్చుకై నా కనిపించడం లేదు.
– విశ్వాసరాయి కళావతి,
పాలకొండ, మాజీ ఎమ్మెల్యే
ఏడాదిన్నరగా శాశ్వత పీవో లేని దుస్థితి
నిధుల్లేవు... విధుల్లేవు..
శాఖలది అదే తీరు
పట్టించుకోని గిరిజనాభివృద్ధి
కూటమి పాలకుల నిర్లక్ష్యం
గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ శాఖ ద్వారా రహదారులు, భవనాలు నిర్మించాల్సి ఉంది. 120కు పైగా గ్రామాలకు పూర్తి స్థాయిలో కనెక్టివిటీ దారులు లేవు. మరికొన్ని చోట్ల ఉన్న రోడ్లు నాణ్యతా లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. చేసిన పనులకు సైతం బిల్లులు లేవంటూ సంబంధిత కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రహదారి సౌకర్యాలు లేక అత్యవసర సమయాల్లో రోగులను ఆసుపత్రులకు తరలించాలన్నా, మార్కెట్‌కు అటవీ ఉత్పత్తులు తీసుకువెళ్లాలన్నా.. గిరిజనుల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయి. ఇంకా వరద గోడలు, మల్టీపర్పస్ భవనాల నిర్మాణాలు పూర్తిగా లేవు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల పనులు పూర్తి కాలేదు.

ఎవరి దారి వారిదే..!

ఎవరి దారి వారిదే..!

ఎవరి దారి వారిదే..!