సీతంపేట: ఐటీడీఏలోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాధ్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) సోమవారం నిర్వహించనున్నారు. గిరిజనులు తమ సమస్యలపై వినతులు ఇవ్వవచ్చని ఐటీడీఏ అధికార వర్గాలు తెలిపాయి.
నేడు పింఛన్‌దారుల సమావేశం
పార్వతీపురం: పట్టణంలోని రైతు బజారు పక్కన వున్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో పింఛన్‌దారులతో సోమవారం సమావేశం నిర్వహించనున్నట్టు ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు గంట జగన్నాధంనాయుడు ఆదివారం తెలిపారు. సమావేశంలో ఇన్‌కంటాక్స్ రిటర్న్స్, ఈ–ఫైలింగ్, భవిష్యత్ ప్రణాళిక గూర్చి చర్చించనున్నట్టు పేర్కొన్నారు. పింఛన్‌దారులు హాజరు కావాలని కోరారు.
మీ కోసం వెబ్‌సైట్‌లో పీజీఆర్‌ఎస్ అర్జీల వివరాల నమోదుకు అవకాశం
పార్వతీపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (ిపీజీఆర్‌ఎస్)లో అర్జీల వివరాలు మీ కోసం వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చని కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రతి రోజూ ప్రజల నుంచి వినతులు స్వీకరించుటకు సెల్లార్‌లో ప్రత్యేకంగా సెల్‌ను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. అర్జీదారులు (మీకోసం డాట్ ఏపీ డాట్ జీఓవీడాట్ ఇన్)వెబ్‌సైట్‌లోలో అర్జీలు నమోదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులోకి 3200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నీరు వచ్చి చేరుతోంది. సువర్ణ ముఖి, వేగావతి నదుల నుంచి నీరు వచ్చి చేరడంతో 64.45 మీటర్లు లెవెల్ నీటిమట్టం ప్రాజెక్టు వద్ద నమోదైంది. దీంతో ఒక గేటు ఎత్తి 2080 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నామని ఏఈ నితిన్ ఆదివారం తెలిపారు.
విజయనగరం అర్బన్: యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 175 ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యమని, వీటిలో ఇప్పటికే 50 పార్కులకు శంకుస్థాపన చేశామని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఆదివారం తన కాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత యువతను దృష్టిలో పెట్టుకొని ప్రతి నియోజవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 11 పార్కుల్లో ప్లాట్ల కేటాయింపు కూడా జరుగుతోందని అన్నారు. రక్షణ రంగం, స్పేస్ టెక్నాలజీ, డ్రోన్స్ తదితర రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నారని ఆయన వివరించారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌లో మరింతగా పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి జరుగుతోందని తెలిపారు. తద్వారా యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం పైడితల్లి అమ్మవారి పండగను మునుపటి ఏడాది మాదిరిగానే భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. పండగలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడతామని మంత్రి వెల్లడించారు.