
కొనసాగుతున్న రెస్క్యూ
పాలకొండ రూరల్: మండలంలోని గొట్ట మంగళాపురం సమీపంలో వంతెనపై నుంచి నాగావళి నదిలో శనివారం సాయంత్రం ఓ గుర్తు తెలియని మహిళ దూకిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో అటు విజయగరం జిల్లా రేగిడి, ఇటు మన్యం జిల్లా పాలకొండ సివిల్ పోలీసులతో పాటు స్థానిక అగ్నిమాపక అధికారులు వెతుకులాట చేపట్టారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. అనుభవజ్ఞులైన ఈతగాళ్లతోపాటు డ్రోన్ సాయంలో కొంత మేరా శోధించారు. అయినప్పటికీ ఎటువంటి ఫలితం లేనట్లు స్థానిక ఎస్సై కె.ప్రయోగమూర్తి తెలిపారు. కేవలం వంతెనపై లభించిన పాదరక్షలు మినహా ఎటువంటి క్లూ గాని, మహిళను సజీవంగా, నిర్జీవంగా గుర్తించలేదన్నారు. తీరం వెంబడి గ్రామాలకు సమాచారం అందించామని, ఇరు జిల్లాల పరిధిలో ఎక్కడా మిస్సింగ్ కేసులు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.