
తాగిన మైకంలో యువకుడి ఆత్మహత్య
పార్వతీపురం రూరల్/గుమ్మలక్ష్మీపురం: మద్యం తాగి ఆ మైకంలో తనకు తానే పదునైన చాక్‌తో తోయక చంద్రశేఖర్(32) అనే యువకుడు తన గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడడంతో గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక తాడికొండ పీహెచ్‌సీకి తరలించారు. ప్రాధమిక వైద్యసేవలు అనంతరం భద్రగిరి సీహెచ్‌సీకు తరలించి వైద్యుల సూచన మేరకు పార్వతీపురం కేంద్ర ఆసుపత్రికి మెరుగైన చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ మృతి చెందినట్టు పార్వతీపురం కేంద్ర ఆసుపత్రి అవుట్‌పోస్టు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. పుట్టికతోనే వినికిడి, మూగ సమస్యలతో దివ్యాంగుడైన చంద్రశేఖర్ తాగుడుకు బానిస అయ్యాడు. అప్పుడప్పుడు మద్యం మత్తులో మతి భ్రమించినట్టు ప్రవర్తిస్తుంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కురుపాం మండలంలోని తెన్నుఖర్జలో తన చెల్లి ఇంటికి వెళ్లి తాగి మద్యం మత్తులో ఉన్న చంద్రశేఖర్‌ను మందలించడంతో తన స్వగ్రామమైన ఎగువతాడికొండకు మూడు రోజుల క్రితం వచ్చి ఎప్పటిలాగే శుక్రవారం మద్యం సేవించి శనివారం వేకువజామున 3గంటల ప్రాంతంలో గొంతుకోసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే వైద్యసేవలకు తరలించామన్నారు. మృతుడు తల్లితండ్రులు చిన్నప్పుడే మృతి చెందగా సోదరుడు కిశోర్‌తో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు.
● ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు
పాలకొండ రూరల్: మండలంలోని గొట్ట మంగళాపురం సమీపంలో నాగావళి నదిపై గల వంతెనపై నుంచి శనివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో గుర్తు తెలియని ఓ మహిళ దూకి ఆత్మహత్యా యత్నం చేసినట్టు అందిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నదీ తీరం పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు విజయనగరం జిల్లా పరిధిలో గల రేగిడి ఆమదాలవలసకు అనుసంధానంగా ఉంది. ఈ క్రమంలో రెండు జిల్లాలకు చెందిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సాయంత్రం సమయంలో దాదాపు 30 ఏళ్ల మహిళ వంతెన పైనుంచి ఆత్మహత్యకు పాల్పడే క్రమంలో నదిలో దూకింది. అక్కడకు సమీపంలో ఉన్న కొందరితో పాటు పాలకొండ వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ కూడా ఈ ఘటనను గుర్తించారు. ఇటీవల కురుస్తున్న వర్ష ప్రభావంతో నదిలో నీటి ఉధృతి అధికంగా ఉండటంతో క్షణాల వ్యవధిలో ఆ మహిళ నదీ ప్రవాహంలో కొట్టుకుంటూ పోయినట్టు చూసిన వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రెండు జిల్లాల పోలీసులు, పాలకొండ అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు వెతుకులాట చేపట్టారు. ఫలితం లేకపోటం, చీకటి పడటంతో అంతా వెనుగిరిగారు. నదిలో దూకిన మహిళ వివరాలు తెలియరాలేదని, ఎటువంటి ఫిర్యాదు అందలేదని, వంతెన వద్ద చెప్పులు మాత్రమే ఉన్నట్టు పోలీసులు తెలిపారు.