
అడవితల్లి ఒడిలో ప్రశాంత జీవనం
● చూడముచ్చటగా కట్టూబొట్టు, ఆచారాలు
● కొండపోడే ఆధారంగా జీవనం
● మౌలికవసతులు అంతంతమాత్రమే
● ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రేపు
సీతంపేట: నవ్యసమాజానికి దూరంగా కొండకోనల్లో జీవనం సాగించే వారే గిరిపుత్రులు. కొండకోనల్లో ప్రత్యేక భాష, సంస్కృతి, సంప్రదాయాల నడుమ ఆదివాసీల జీవనం వైవిధ్యంగా సాగుతోంది. కాయకష్టం చేసి జీవించడం వారి జీవన విధానం. భిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలు గిరిజనుల సొంతం. కొండల్లో తమ సంప్రదాయ వ్యవసాయాన్ని చేసుకుంటూ జీవిస్తున్న గిరిజనుల ఆచార వ్యవహారాలు, కట్టుబొట్టుల్లో మార్పులేదు. అటవీఉత్పత్తుల సేకరణ, పోడుపంటలు, వ్యవసాయ పంటల దిగుబడులు వచ్చినప్పుడు గిరిజనులు ప్రత్యేక పండగలు జరుపుకోవడం ఆనవాయితీ.
విభిన్నం–వైవిధ్యం..
సంప్రదాయ ఆచార వ్యవహారాల్లో ఎంతో వైవిధ్యం కనబరిచే గిరిజనులు అటవీ సంస్కృతికి ప్రతీకలు. ఘన చరిత్రకు వారసులు. వారి ఆధ్యాత్మిక చింతన వినూత్నం.వారి కట్టూ బొట్టూ చూడముచ్చటగా ఉంటాయి. తెల్లారితే కొండపోడు వ్యవసాయం, అటవీఉత్పత్తుల సేకరణతోనే వారి జీవనం సాగుతుంది. ప్రతి మూడు నెలలకు ఒక్కో అటవీ ఉత్పత్తుల సీజన్ ఆరంభమవుతుంది. పైనాపిల్, సీతాఫలం, పసుపు, జీడి, కందులు, నిమ్మ, బత్తాయి, పెండలం ఇలా అటవీ ఉత్పత్తులతోనే వారి జీవనం ముడిపడి ఉంది. వారం వారం జరిగే వారపు సంతలకు వెళ్లి వారి ఉత్పత్తులు విక్రయించి వారానికి సరిపడా నిత్యావసర సరుకులు కొనుగోలు చేసుకుంటారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 819 కిలోమీటర్ల మేర ఏజెన్సీ విస్తరించి ఉంది. 42 వేల 246 గిరిజన కుటుంబాల్లో 2లక్షల 62వేల మంది కుటుంబ సభ్యులున్నారు. మొత్తం 1187 గిరిజన గూడలుండగా వాటిలో ఆదిమ గిరిజనులు నివసించే గూడలు 467 ఉన్నాయి. గిరిజనుల్లో ప్రధానంగా కొండ సవర, జాతాపు, కాపు సవర తెగలున్నాయి. వివాహాలు, పండగలు, వ్యవసాయం తదితర సందర్భాల్లో ప్రత్యేక పండగలు నిర్వహించుకోవడం ఎంతో వైవిధ్యం. భార్యకు కట్నం ఇచ్చి వివాహం చేసుకునే ‘మొగనాలి’ ఇప్పటికీ కొన్ని చోట్ల అమల్లో ఉంది.
అభివృద్ధికి ఆమడదూరంలో..
మన్యంలో గిరిజనుల అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉంది. గిరిజనులకు మౌలికవసతులు లేక అల్లాడుతున్నారు. విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు చాలా గ్రామాలకు లేవు. రక్షిత మంచీనీటి వ్యవస్థ అందుబాటులో లేదు. అనాదిగా గిరిజనులు ప్రకృతి ఆధారంగానే జీవన మనుగడ సాగిస్తున్నారు. సుమారు 120కి పైగా గ్రామాలకు రహదారి సౌకర్యం ఇప్పటికీ లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అంతంతమాత్రంగా వైద్యసేవలు
ఎపిడమిక్ సీజన్‌లో ఏజెన్సీలో మలేరియా విజృంభిస్తుంది. పీహెచ్‌సీల్లో డాక్టర్ల కొరత వేధిస్తోంది. ఇప్పటి వరకు దోమతెరల పంపిణీ లేదు. ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వైద్యసేవల కోసం ఇంతవరకు హెల్త్ వలంటీర్‌లను నియమించలేదు. పాఠశాలల్లో కనీస మౌలికవసతులైన మరుగుదొడ్లు, అదనపు తరగతుల గదుల సమస్యలు వేధిస్తున్నాయి. గిరిజనోత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేవు. అన్ని అటవీ ఉత్పత్తులు జీసీసీ కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. ముఖ్యంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటికి రేషన్ ఇవ్వడం కోసం ప్రవేశపెట్టిన ఎండీయూ వాహనాలు రద్దు చేయడంతో రేషన్ కొండలపైకి మోసుకుని తీసుకువెళ్తూ గిరిజనులు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.
అక్షరాలే ఆరాధ్యదేవతలు–లిపివారిప్రాణం..
శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మరో వైవిధ్యముంది. ఇక్కడ అక్షరాలను ఆరాధ్యదేవతలుగా గిరిజనులు పూజిస్తారు. ఏ దేవతకై నా పూజలు చేసినా నైవేద్యంగా సారా పెట్టి పూజ అనంతరం పూటుగా తాగుతారు. జీలుగు సారా వంటివి చెట్టునుంచి దించితే ముందుగా తెడ్డులతో సేవిస్తారు. వారి పండగలు, సంప్రదాయాలను బొమ్మల రూపంలో వేయడంలో వారికి వీరేసాటి. ఏజెన్సీలో అక్షరబ్రహ్మ, మడిబ్రహ్మ వంటి ఆలయాలు వెలిశాయి. అక్కడి గిరిజనులు ప్రతి గురువారం పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆగం పండగ వంటివి చేస్తుంటారు. సవర లిపి ద్వారా కొంతమంది ఆదిమ గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. వారు వేసే లిపికి మైదాన ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇటీవల కాలంలో దీనిని అభివృద్ధి చేస్తున్నారు.
ఆదివాసీ దినోత్సవం నిర్వహణ ఎందుకంటే..
ఆదివాసీల జీవన స్థితిగతులను ప్రపంచానికి తెలియజేసేందుకు ఐక్యరాజ్యసమితి 1194 ఆగస్టు 9న జెనీవాలో ప్రపంచ ఆదివాసీ వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ వర్కింగ్ గ్రూప్ ఆదివాసీలపై అధ్యయనం చేసి ప్రపంచ దేశాల్లో ఆదివాసీల సమస్యలన్నీ దాదాపు ఒకేలా ఉన్నాయని గుర్తించింది. దీంతో ఏటా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించాలని యూఎన్‌వో ప్రకటించింది.
కొండపోడే ఆధారం..
పోడు వ్యవసాయం ప్రధాన జీవనాధారంగా కుటుంబాలతో ఆనందంగా జీవిస్తారు. భూ ఉపరితలానికి అత్యంత ఎత్తైన భాగంలో గూడల్లో నివసిస్తూ భయమంటే తెలియదన్నట్లు క్రూరమృగాల నడుమ, విష సర్పాల పడగ నీడలో సాహస జీవితం గడుపుతుంటారు. జిల్లాలోని అటవీ ప్రాంతమంతా ప్రకృతి సోయగాలతో అలరారుతుంది.

అడవితల్లి ఒడిలో ప్రశాంత జీవనం

అడవితల్లి ఒడిలో ప్రశాంత జీవనం

అడవితల్లి ఒడిలో ప్రశాంత జీవనం

అడవితల్లి ఒడిలో ప్రశాంత జీవనం