రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు వెంపడాం విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు వెంపడాం విద్యార్థులు

Aug 8 2025 8:57 AM | Updated on Aug 8 2025 9:19 AM

పూసపాటిరేగ: మండలంలోని వెంపడాం జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్ధులు రాష్ట్రస్థాయి అధ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 3 వతేదీన విజయనగరంలోని విజ్జీ స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల ఎంపికలలో పాఠశాలకు చెందిన పి.వెంకటలక్ష్మి (లాంగ్‌జంప్‌), వి.కల్యాణి (హైజంప్‌), పి.శ్రీను (100 మీటర్లు, 200 మీటర్లు రన్నింగ్‌)లు ఎంపికయ్యారు. దీంతో ఈనెల 9,10 తేదీలలో రాష్ట్రస్థాయిలో బాపట్ల జిల్లా చీరాలలో జరగబోయే అథ్లెటిక్స్‌ పోటీల్లో పాల్గొననున్నారు. పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడంతో పాఠశాల హెచ్‌ఎం పి.లచ్చన్న, పీడీ గణేష్‌కుమార్‌తో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.

జాతీయ పోటీల్లో దివ్యాంగ విజేతకు అభినందనలు

విజయనగరం అర్బన్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో మేధోవైకల్యం గల ప్రత్యేక అవసరాల పిల్లలకు ఇటీవల జరిగిన జాతీయ స్థాయి స్పెషల్‌ ఒలింపిక్‌ గేమ్స్‌ బేస్‌బాల్‌లో కాంస్యపతక విజేత అయిన తెర్లాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థిని తోషినిని జిల్లా విద్యాశాఖ అధికారి యూ.మాణిక్యంనాయుడు, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్‌ ఎ.రామారావు అభినందించారు. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని వారి కార్యాలయాలకు వచ్చి అధికారులను తోషిని కలిసింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సాధారణ విద్యార్థుల మాదిరిగానే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు కూడా ప్రతిభ చూపడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. అనంతరం విజేతను, కోచ్‌లుగా వ్యవహరించిన పి.సునీల్‌, ఎస్‌.బంగారునాయుడిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా సహిత విద్య సమన్వయకర్త ఎస్‌.సూర్యారావు, సహ సమన్వయకర్త ఎం.భారతి, తెర్లాం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్‌ఎస్‌ఎం రమేష్‌, కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నాటుతుపాకీతో ఇద్దరి అరెస్ట్‌

వేపాడ: మండలంలోని సోంపురం గ్రామంలో నాటుతుపాకీ ఉన్నట్లు అందిన సమాచారం మేరకు తనిఖీ చేయడంతో నాటుతుపాకీ పట్టుబడినట్లు ఎస్సై సుదర్శన్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన అందించిన వివరాలిలా ఉన్నాయి. సోంపురం గ్రామానికి చెందిన గొర్లె ఈశ్వర్రావు ఇంటిలో తనిఖీలు నిర్వహించగా నాటుతుపాకీ పట్టుబడినట్లు చెప్పారు. తుపాకీపై ఆరాతీయడంతో గుడివాడ గ్రామానికి చెందిన రొంగలి బంగారయ్య వద్ద రూ.4500కు కొనుగోలు చేసినట్లు ఈశ్వర్రావు తెలిపాడని చెప్పారు. ఎటువంటి ప్రభుత్వ అనుమతులులేకుండా తుపాకీ కలిగి ఉన్నందున ఈశ్వర్రావును, నాటు తుపాకీ అమ్మడం చట్ట రీత్యా నేరమైనందున విక్రయించిన బంగారయ్యను ఎస్‌.కోట రూరల్‌ సీఐ అప్పలనాయుడు అరెస్టు చేసినట్లు ఎస్సై చెప్పారు.

ఆర్టీసీ డార్మిటరీలో వ్యక్తి మృతి

విజయనగరం క్రైమ్‌: విజయనగరం ఆర్టీసీ డార్మిటరీలో ఓ వ్యక్తి మృతి చెందాడు. దీనిపై వన్‌ టౌన్‌ పోలీసులకు గురువారం అందిన ఫిర్యాదు మేరకు స్టేషన్‌ హెచ్‌సీ ఆవాల రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశాఖ జిల్లా తగరపు వలసకు చెందిన సబ్బిశెట్టి కృష్ణమూర్తి(54) శశికాలేజీలో కుక్‌గా పని చేస్తున్నాడు. మందుల కోసం విజయనగరం వచ్చి రాత్రి కావడంతో ఆర్టీసీ డార్మిటరీలో రూమ్‌ తీసుకుని ఉండిపోయాడు. నిద్ర సమయంలోనే గుండె పోటు రావడంతో మృతి చెంది ఉండవచ్చని మృతుడి అల్లుడు మక్కడపల్లి శ్రీనివాస్‌ చేసిన ఫిర్యాదు మేరకు వన్‌ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు వెంపడాం విద్యార్థులు1
1/3

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు వెంపడాం విద్యార్థులు

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు వెంపడాం విద్యార్థులు2
2/3

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు వెంపడాం విద్యార్థులు

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు వెంపడాం విద్యార్థులు3
3/3

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు వెంపడాం విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement