రామభద్రపురం: మండలంలోని ఆరికతోట పరిధిలో బుధవారం ప్రమాదవశాత్తు కింద పడిపోయిన వ్యక్తికి సకాలంలో సహాయక చర్యలందకపోవడంతో మృతిచెందాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని నాయుడువలస పంచాయతీ మధుర గ్రామం కొండపాలవలసకు చెందిన లెంక ధనుంజయ(33)ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. రోజులాగానే బుధవారం కూడా ట్రాక్టర్ తోలడానికి వెళ్లిపోయి అదే మండలం ఆరికతోట గ్రామ పొలంలో మొక్కజొన్న కంకులు రెండు లోడులు పెరిగాడు. మూడో లోడుకు వెళ్లకుండా పొలంలో ట్రాక్టర్ వదిలేసి చెట్ల నీడకు వెళ్దామన్న ఉద్దేశంతో అక్కడికి కొద్ది దూరంలో ఉన్న నీలగిరి తోటలోకి వెళ్తుండగా తోటలో గతంలో నరికిన చెట్ల మొదళ్లు తన్నుకుని కంకర రోడ్డులో బోర్లా పడిపోయాడు.
ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పాటు ఎండవేడిమి ఎక్కువగా ఉండడంతో వెంటనే సహాయక చర్యలందక మృతిచెందాడు. బుధవారం రాత్రికి కూడా ధనుంజయ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. మద్యం తాగే అలవాటు ఉన్నోడు కదా ఏదో టైమ్‌లో ఇంటికి వచ్చేస్తాడులే అన్న ఉద్దేశంతో అలా వదిలేశారు. ట్రాక్టర్ ఓనర్ కూడా వెతికి తన ట్రాక్టర్‌ను తీసుకెళ్లిపోయాడు. గురువారం ఉదయం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ట్రాక్టర్ వదిలేసిన పరిసరాల్లో మళ్లీ వెతికారు. అయినా కనిపించకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోతున్న సమయంలో ఆరికతోట గ్రామానికి చెందిన ఓ రైతు గడ్డిమోపు పట్టుకుని కనిపించి నీలగిరి తోటలో ఎవరో పడి ఉన్నారని చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు వెళ్లి అప్పటికే మృతిచెంది ఉన్న ధనంజయను చూసి అవాక్కయ్యారు.
బోర్లా పడి ఉన్న మృతదేహం ముఖంపై రక్తం మరకలు ఉండడం చూసి ఎలా మృతి చెంది ఉంటాడు? ఎవరైనా చంపి పడేశారా? మృతుడికి ఎవరూ శత్రువులు లేరే అని అలోచించి అనుమానాస్పద మృతిగా భావించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై వి. ప్రసాదరావు సిబ్బందితో కలిసి ఘటనా చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్‌ను రప్పించి సాధారణ మృతా? లేక హత్యా? అని పరిశీలించి సాధారణ మృతిగా నిర్ధారించారు.కుటుంబ సభ్యుల సమక్షంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాడంగి సీహెచ్‌సీకి తరలించి అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడి భార్య గౌరీశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య గౌరీశ్వరి, పాప, బాబు ఉన్నారు.

సహాయక చర్యలందక వ్యక్తి మృతి