
ముర్రుపాలు అమూల్యం
విజయనగరం ఫోర్ట్: బిడ్డ పుట్టిన ఐదు నిమషాల లోపు తల్లి ఇచ్చే ముర్రుపాలు ఎంతో అమూల్యమైనవని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. ఆ పాలలో అద్భుతమైన పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయని, అవి బిడ్డ ఎదుగుదలకు ఉపయోగపడతాయన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిపాల గొప్పదనం గురించి నిత్యం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి మహిళకు దీని గురించి వివరించాలన్నారు. మహిళలు బిడ్డకు పాలు అందించేందుకు బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వేస్టేషన్, కలెక్టరేట్‌లలో బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటికే ఉన్నట్లయితే వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెస్తామన్నారు. బ్రెస్ట్ కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ తల్లి కావడమే గొప్ప అదృష్టమన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే పాలు అందించడం తల్లి బిడ్డలిద్దరికీ శ్రేయస్కరమన్నారు. ఆ తర్వాత గర్భిణులకు సామూహిక సీమంతం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ 5వ స్టాండింగ్ కమిటీ చైర్‌పర్సన్ శాంతికుమారి, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ హిమబిందు, ఐసీడీఎస్ పీడీ విమలారాణి, డీఎల్‌ఓ డాక్టర్ రాణి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారిణి అన్నపూర్ణ, బీసీ సంక్షేమ శాఖ అధికారిణి జ్యోతి శ్రీ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత, నేచర్ సంస్థ డైరెక్టర్ వికాస్ బాలరాజ్, ఘోషా ఆస్పత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ సుజాత పాల్గొన్నారు.
కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్