
ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి
● రహదారులపై అక్రమణలు తొలగించాలి
● జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్
విజయనగరం అర్బన్: రహదారులపై ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రహదారులపై అక్రమణలు తొలగించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశం గురువారం జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రహదారిపై ప్రమాదాల నివారణకు చేపట్టవలసిన చర్యలు తీసుకోవడమే కాకుండా నిబంధనలను కఠినంగా అమలు చేయాలన్నారు. రహదారులు, జంక్షన్‌లు, బ్లాక్ స్పాట్స్, పాఠశాలల వద్ద ఆక్రమణలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఐఆర్‌ఏడీ యాప్‌లో రోడ్డు ప్రమాద వివరాలను నమోదు చేయాలని తెలిపారు. ఐఆర్‌ఏడీ యాప్‌పై అన్ని శాఖల అవగాహన కోసం జూమ్ మీటింగ్ నిర్వహించాలని సూచించారు. రోడ్లు భవనాలు, పోలీసు, రవాణా, పంచాయతీరాజ్ శాఖల సంయుక్త బృందాలు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైన చోట హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గత సమావేశం నుంచి ఇప్పటివరకు పెండింగ్ ఉన్న కేసులను తక్షణమే క్లియర్ చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ సౌమ్యలత, రహదారులు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ కె.కాంతిమతి, డీసీహెచ్‌ఎస్ పద్మశ్రీరాణి, విజయనగరం మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మి, ఎంవీఐ మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.