
అర్ధరాత్రి ఈదురుగాలులు
● విద్యుత్ వైర్లపై పడిన చెట్టుకొమ్మలు
వీరఘట్టం: మండల వ్యాప్తంగా బుధవారం అర్ధరాత్రి భారీగా ఈదురుగాలులు వీచాయి. అయితే వర్షం పడుతుందని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. ఈదురుగాలుల ధాటికి స్థానిక దుర్గగుడి సమీపంలో ఉన్న ఓ భారీ వృక్షం చెట్టుకొమ్మలు బుధవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో విరిగి పడ్డాయి.ఈ చెట్టుకొమ్మలు విరిగి పక్కనే ఉన్న విద్యుత్ వైర్లపై పడడంతో విద్యుత్ వైర్లు చెల్లాచెదురుగా తెగిపడ్డాయి.రెండు విద్యుత్ స్తంభాలు పాక్షికంగా వాలిపోయాయి. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.వెంటనే ఏఈ అనిల్‌కుమార్, లైన్‌మెన్ సింహాచలం, రవి, పవన్, సురేష్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనంతరం చెట్టు కొమ్మలు తొలగించి వీరఘట్టం మండలకేంద్రానికి తాత్కాలికంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. అయితే చెట్టుకొమ్మలు పడడంతో విద్యుత్ వైర్లు తెగిపడి వాటి పరిధిలో ఉన్న పోలీసుస్టేషన్, కొత్త బస్టాండ్, దుర్గపేట, మెయిన్‌రోడ్డులో కొన్ని గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టి రెండు కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి వైర్లు సరిచేసి గురువారం సాయంత్రం 5 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. వీరఘట్టం టౌన్‌కు విద్యుత్ సరఫరా లేకపోవడంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అర్ధరాత్రి ఈదురుగాలులు