
వట్టిగెడ్డ నీరు.. ఒట్టిదేనా!
జియ్యమ్మవలస రూరల్: కురుపాం. జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాల్లో దాదాపు 16,500 ఎకరాలకు సాగునీటిని అందించే వట్టిగెడ్డ.. ఇంకా రైతులకు ఎదురు చూపులే మిగులుస్తోంది. జియ్య మ్మవలస మండలంలోని ప్రధాన సాగునీటి వనరు వట్టిగెడ్డ జలాశయం. ఏటా ఖరీఫ్‌లో సాగునీరు విడుదల చేస్తారు. ఆగస్టు రెండు, మూడు తేదీల్లోనే ఈ ప్రక్రియ జరిగిపోతుంది. కుడి, ఎడమ కాలువలు వరుసగా 9.75, 8.047 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. వట్టిగెడ్డ నుంచి కుడి కాలువ ద్వారా 13,324 ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 3,360 ఎకరాలకు సాగుకు నీరు అందించాల్సిఉంది. ఆగస్టు 8వ తేదీ వచ్చినా నేటికి నీటి విడుదల జాడ లేదు. నీటి విడుదల లేక ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నాలుగు రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. నాట్లు పడక నారు మడులు, వరి వెదలు ఎండిపోతున్నాయి. వట్టిగెడ్డ రిజర్వాయర్ పరిధిలో ఒకసారే వరి పంట రైతులు పండిస్తున్నారు. ఈ సంవత్సరం సాగునీరు సకాలంలో అందకపోతే రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. ప్రాజెక్టు నిర్వహణ సిబ్బంది కూడా అంతంత మాత్రంగానే ఉన్నారు. కాలువ లకు ప్రతీ 5 కిలోమీటర్లకు, డిస్ట్రిబ్యూటర్ల వద్ద 1500 ఎకరాలకు ఒక్కొక్కరు చొప్పున లస్కర్లు ఉండాలి. మొత్తం 23 మంది అవసరం. కానీ ప్రస్తుతం ఒక్కరే ఉన్నారు. ఈ నెల ఆరో తేదీన స్థానిక కూటమి ఎమ్మెల్యే జగదీశ్వరి వట్టిగెడ్డ నుంచి సాగునీటిని విడుదల చేస్తారని కూటమి నాయకులు ప్రకటించారు. తేదీ గడిచినా సాగునీరు మాత్రం విడుదల చేయలేదు. ఇటు ఎమ్మెల్యే జాడ కూడా కానరావడం లేదు. రైతుల కోసం కనీసం ఆలోచించకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
వట్టిగెడ్డ.. జియ్యమ్మవలస మండలంలోని మూడు మండలాల్లోని పంట భూములకు సాగునీటి ఆదరువు. వరినాట్లు ముమ్మరంగా జరిగే ఆశ్లేషకార్తె వచ్చినా జలాశయం నుంచి చుక్కనీరు రావడం లేదు. కనీసం నీరు విడిచిపెట్టాలన్న ధ్యాస స్థానిక ఎమ్మెల్యేకు లేకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. వరి నారుమడులు, వెదలు ఎండిపోతున్నాయని, ఇంకెప్పుడు నీరు విడిచిపెడతారని ప్రశ్నిస్తున్నారు.
ఆగస్టు వచ్చినా అందని సాగునీరు
ఆయకట్టు రైతుల్లో ఆందోళన
ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్లు?
సాగునీటిని వెంటనే విడిచిపెట్టాలి
రావాడ వట్టిగెడ్డ రిజర్వాయర్ సాగునీటిని వెంటనే కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా విడిచిపెట్టాలని జియ్యమ్మవలస మండల వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. చినమేరంగిలోని శత్రుచర్ల కోటలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఏటా ఈ సమయానికే సాగునీటిని ఇరిగేషన్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు విడిచిపెట్టేవారని, నేడు ఏడవ తేదీ అవుతున్నా విడుదల చేయకపోవడం తీవ్ర అన్యాయమన్నారు. నీరు లేక ఆయకట్టు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలు అధికారులకు కనించడం లేదా? అని ప్రశ్నించారు. తక్షణమే నీరు విడుదల చేయకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇరిగేషన్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ కోట రమేష్, వైస్ ఎంపీపీ గుడివాడ సంపత్ కుమార్, బలగ వెంకటరమణ, లోలుగు నారాయణరావు, పోల గోవిందరావు, తాడేల మన్మధరావు, బెజ్జిపొరపు మురళి పాల్గొన్నారు.

వట్టిగెడ్డ నీరు.. ఒట్టిదేనా!